NZ vs AUS: నీ కష్టం ఎవరికీ రాకూడదు: ఊహించని రీతిలో విలియంసన్ రనౌట్

NZ vs AUS: నీ కష్టం ఎవరికీ రాకూడదు: ఊహించని రీతిలో విలియంసన్ రనౌట్

ఫామ్ లో ఉన్న బ్యాటర్ రనౌట్ అయితే ఎంత బాధ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ విలియంసన్ కి ఇలాంటి పరిస్థితే ఎదురైంది.  సెంచరీల మీద సెంచరీలు బాదేస్తూ రికార్డులు బద్దలు కొడుతున్న ఈ కివీస్ స్టార్.. ఊహించని రీతిలో రనౌటై తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఆస్ట్రేలియాతో వెల్లింగ్ టన్ వేదికగా జరుగుతున్న టెస్టులో ఈ సంఘటన చోటు చేసుకుంది. 

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య నిన్న (ఫిబ్రవరి 29) తొలి టెస్ట్ ప్రారంభమైంది. రెండో రోజు ఆటలో భాగంగా నేడు (మార్చి 1) ఇన్నింగ్స్ 5వ ఓవర్‌లో మిచెల్ స్టార్క్ వేసిన డెలివరీని విలియమ్సన్ మిడ్-ఆఫ్‌ వైపుగా ఆడాడు. సింగిల్ కోసం పరిగెత్తడానికి ప్రయత్నించగా.. మరో ఎండ్ లో ఉన్న విల్ యంగ్ వెనక నుంచి ఫీల్డర్ ను చూస్తూ ముందుకొచ్చాడు. అప్పటికే క్రీజ్ దాటేసి సగం వరకు వచ్చిన విలియంసన్ ను యంగ్ ఢీ కొట్టాడు. వీరి మధ్యలో బౌలర్ స్టార్క్ అడ్డు రావడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.

అప్పటికే మిడాఫ్ లో ఉన్న ఫీల్డర్ మార్నస్ లాబుస్‌చాగ్నే వికెట్లకు డైరెక్ట్ హిట్‌ వేయడంతో కేన్ రనౌటయ్యాడు. 2012 తర్వాత టెస్ట్ మ్యాచ్‌లో విలియమ్సన్ రనౌట్ కావడం ఇదే తొలిసారి. ఇటీవలే దక్షిణాఫ్రికాపై విలియంసన్ 4 ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచరీలు బాదేశాడు. ఇతను అవుట్ కావడంతో కివీస్ 179 పరుగులకే ఆలౌటైంది. గ్లెన్ ఫిలిప్స్ 71 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. అంతకముందు ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్ లో 383 పరుగులకు ఆలౌటైంది.