
రణబీర్ కపూర్ హీరోగా ‘రామాయణ’ పేరుతో ఓ ప్రెస్టీజియస్ మూవీ తెరకెక్కబోతోంది. ‘రామాయణం’ ఆధారంగా నితిన్ తివారీ రూపొందించే ఈ చిత్రంలో రణబీర్ రాముడిగా నటించనున్నాడు. ఇందులో సాయిపల్లవి సీతగా, కన్నడ స్టార్ యశ్ రావణుడిగా నటిస్తాడని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇందులో నటించడం మాటెలా ఉన్నా, నిర్మాతగా ఈ ప్రాజెక్ట్‌లో జాయిన్ అయ్యాడు యశ్.
‘రామాయణ’ను నిర్మిస్తున్న నమిత్ మల్హోత్రాతో కలిసి ఈ విషయాన్ని అతను కన్‌ఫర్మ్ చేశాడు. ‘మన భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే సినిమాలు తీయాలని మాన్‌స్టర్ మైండ్స్ క్రియేషన్స్ సంస్థను ఏర్పాటు చేశా. అలాంటి కథల కోసం ఎదురుచూస్తున్న క్రమంలో లాస్ ఏంజెల్స్‌కు చెందిన వీఎఫ్‌ఎక్స్ స్టూడియోతో టైఅప్ అయ్యాను. అది నమిత్ మల్హోత్రాది.
మేమిద్దరం కొత్త చిత్రాల గురించి చర్చలు జరుపుతున్న క్రమంలో ‘రామయణ’ టాపిక్ వచ్చింది. రామాయణం గురించి ఎన్నిసార్లు చెప్పినా ప్రతిసారి కొత్తగా చెప్పడానికి ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. అలాంటి గొప్ప ఇతిహాసాన్ని తెరపైకి తీసుకురాబోతున్నాం. అంతర్జాతీయ వేదికపై ఈ చిత్రం ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని పంచుతుందని నమ్ముతున్నా’ అని చెప్పాడు. శ్రీరామ నవమి సందర్భంగా ఈ చిత్రంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.