రీల్స్‌‌తో దంపతుల వలపు వల.. భార్యతో నగ్నంగా ఉన్నప్పుడు వీడియోలు తీసి భర్త బ్లాక్మెయిల్

రీల్స్‌‌తో దంపతుల వలపు వల.. భార్యతో నగ్నంగా ఉన్నప్పుడు వీడియోలు తీసి భర్త బ్లాక్మెయిల్

కరీంనగర్, వెలుగు: ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ వేదికగా యువకులు, వ్యాపారులకు వలపు వల విసిరి.. వారితో ఏకాంతంగా గడిపిన సమయంలో వీడియోలు తీసి, బ్లాక్ మెయిల్ చేసిన దంపతులను కరీంనగర్ రూరల్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ దంపతుల వలలో పడి ఇప్పటికే వంద మంది వరకు మోసపోగా.. చివరికి ఓ బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు వీరి బాగోతాన్ని బట్టబయలు చేశారు. మంచిర్యాలకు చెందిన దంపతులు కరీంనగర్ రూరల్ మండలం ఆరెపల్లిలోని శ్రీసాయి నివాస్ అపార్ట్ మెంట్‎లో రెండేళ్లుగా అద్దెకు ఉంటున్నారు. 

గతంలో మార్బుల్స్‎తో పాటు ఇంటీరియర్ డిజైనింగ్ వర్క్స్ చేసి ఆర్థికంగా నష్టపోయారు. దీంతో ఎలాగైనా బాగా డబ్బులు సంపాదించాలనే టార్గెట్‎తో సదరు మహిళ ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్‎లో రీల్స్ చేయడం ప్రారంభించింది. యూట్యూబ్ చానల్ కూడా నిర్వహిస్తోంది. ఇన్ స్టాలో ఆమెకు17 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ క్రమంలోనే పలువురు ఆమెకు మెసేజ్ చేసి నంబర్ తీసుకొని సంప్రదించగా డబ్బులు ఇస్తే ఏకాంతంగా గడుపుతానని తన అడ్రస్ చెప్పింది. 

ఇలా కరీంనగర్‎తో పాటు చుట్టుపక్కల ఏరియాల నుంచి కొందరు బడా వ్యాపారస్తులు, యువకులు వచ్చి ఆమెతో గడిపి డబ్బులిచ్చారు. అయితే, వాళ్లు ఆమెతో ఒంటరిగా నగ్నంగా ఉన్న సమయంలో ఆమె భర్త వారికి తెలియకుండా తన ఫోన్‎లో వీడియో రికార్డు చేసేవాడు. ఇలా వచ్చిన డబ్బులతో కొత్తగా కొనుగోలు చేసిన అపార్ట్ మెంట్‎లో ఫ్లాట్‎కు ఈఎంఐ కట్టడంతోపాటు మూడు నెలల క్రితమే కారు కొనుగోలు చేశారు. 

అంతటితో ఆగకుండ మీ వీడియోలు బయటపెడుతానంటూ సదరు మహిళ భర్త వారిని ఫోన్ చేసి బెదిరించడం మొదలుపెట్టాడు. ఇలా సుమారు వంద మందిని బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నగ్నంగా ఉన్న వీడియోలు, ఫొటోలు బయటపడితే పరువు పోతుందని బయటికి చెప్పుకోలేక కొందరు పలుకుబడి గల వ్యక్తులు లక్షల్లో డబ్బులు ముట్టజెప్పారు.  

చంపుతామని బెదిరింపులు.. 

ఏడాది క్రితం వీరికి ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ఆమె భర్తతో కలిసి తరచూ మద్యం తాగుతూ ఆమెతో ఏకాంతంగా గడిపేవాడు. ఇదే అదనుగా అతడితో అపార్ట్ మెంట్ లోన్లు, కారు ఈఎంఐలు కట్టించారు. చివరకు అతడి దగ్గర డబ్బులు అయిపోవడంతో అటువైపు వెళ్లడం మానేశాడు. దీంతో అతడికి వాట్సాప్ కాల్స్ చేసి ఎందుకు రావడం లేదని దబాయించారు. 'నా దగ్గర డబ్బులు లేవు.. ఇక నన్ను మర్చిపోండి' అని అతడు చెప్పడంతో.. చివరగా రూ.5 లక్షలు ఇస్తే వదిలేస్తామన్నారు. 

తన దగ్గర డబ్బులు లేవని చెప్పడంతో ఆ వీడియోలు అతడి ఇంట్లో వాళ్లకు పంపిస్తామని, అప్పటికీ ఇవ్వకపోతే చంపుతామని బెదిరించారు. దీంతో అతడు భయపడి రూ.లక్ష ఇచ్చాడు. మిగతా రూ.4 లక్షలు రెండు రోజుల్లో పంపిస్తానన్నాడు. ఇప్పటికే రూ.14 లక్షలు ఇచ్చానని, తనను ఏమీ చేయవద్దని, వీడియోలు డిలీట్ చేయాలని వేడుకున్నాడు. అయినాసరే వాళ్లు వినలేదు. రూ.4 లక్షలు ఇవ్వకపోతే వీడియోలు బయటపెట్టి, చంపుతామని బెదిరించారు. 

చివరకు బాధితుడు బంధువుల సలహాతో మంగళవారం పోలీసులకు ఫోన్ పే ఆధారాలతో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం సదరు దంపతులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నారు. కారును, వారు వీడియోలు తీసిన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చి, రిమాండ్‎కు తరలించారు. దంపతులకు ఓ కొడుకు, బిడ్డ ఉన్నారు. కాగా, నిందితులను 24 గంటల్లో పట్టుకున్నందుకు కరీంనగర్ రూరల్ సిబ్బందిని కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ అభినందించారు.