కరీంనగర్ ​కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచాల?

కరీంనగర్ ​కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచాల?
  •  అట్టహాసంగా నామినేషన్​ వేసిన రాజేందర్​రావు
  • తోడు వెళ్లిన మంత్రి పొన్నం, ముగ్గురు ఎమ్మెల్యేలు
  • అల్గిరెడ్డి వర్గీయుల్లో అయోమయం
  • కరీంనగర్​లో రసవత్తరంగా కాంగ్రెస్​ రాజకీయం

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్‌రావు పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ కార్యక్రమాలు, ప్రచారంలో బిజీగా ఉన్న ఆయన..రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, లోక్ సభ పరిధిలోని ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, మిగతా నియోజకవర్గాల పార్టీ ఇన్ చార్జీలతో కలిసి సోమవారం కరీంనగర్ లో భారీ ర్యాలీ నిర్వహించి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం చర్చనీయాంశంగా మారింది.

ఇప్పటికే రాష్ట్రంలోని 14 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్ అధిష్టానం..కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ స్థానాలను పెండింగ్ లో పెట్టిన విషయం తెలిసిందే. నోటిఫికేషన్ విడుదలై నామినేషన్ల గడువు దగ్గరపడుతున్నా.. ఈ మూడు లోక్ సభ స్థానాలకు అభ్యర్థుల పేర్ల ఖరారులో ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా క్యాండిడేట్ అనౌన్స్ కాకముందే నామినేషన్ వేయడం, పట్టువదలని విక్రమార్కుడిలా ప్రవీణ్ రావు ఇంకా చివరి ప్రయత్నాల్లో ఉండడంతో కరీంనగర్​ కాంగ్రెస్ రాజకీయం రసవత్తరంగా మారింది. 

ఎమ్మెల్యేల మద్దతు రాజేందర్ రావుకే.. 

కరీంనగర్ సీటు కోసం చివరి వరకు వెలిచాల రాజేందర్ రావు, మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి పోటీపడగా.. చివరికి రాజేందర్ రావు వైపే అధిష్టానం మొగ్గు చూపినట్టు సమాచారం. రాజేందర్ రావు అభ్యర్థిత్వానికి రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యంతోపాటు నియోజకవర్గ ఇన్‌చార్జీలు వొడితెల ప్రణవ్‌, పురమల్ల శ్రీనివాస్‌, కేకే మహేందర్‌రెడ్డి మద్దతుగా నిలవడం కూడా కలిసొచ్చింది. రాజేందర్‌రావు తండ్రి వెలిచాల జగపతిరావు కరీంనగర్‌ఎమ్మెల్యేగా పనిచేశారు. రాజేందర్‌ రావు గతంలో కరీంనగర్‌ వ్యవసాయ మార్కెట్‌కమిటీ చైర్మన్ గా పనిచేశారు. కొంతకాలం టీఆర్ఎస్, తర్వాత ప్రజారాజ్యంలో ఉ న్నారు. 2009 లోక్ సభ ఎన్నికల్లో ప్రజారాజ్యం అభ్యర్థిగా కరీంనగర్‌ నుంచి పోటీ చేసి 1.75 లక్షల ఓట్లు సాధించారు. తర్వాత పాలిటిక్స్​కు దూరమయ్యారు. 

అల్గిరెడ్డి వర్గీయుల్లో అయోమయం

మంత్రి పొన్నం ప్రభాకర్​కు హుస్నాబాద్ అసెంబ్లీ టికెట్ ఇవ్వడంతో ఆ టికెట్ ఆశించిన అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి త్యాగం చేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ సర్కారు వస్తే సముచిత స్థానం కల్పిస్తామని అల్గిరెడ్డికి అప్పట్లోనే అధిష్టానం హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇటీవల కరీంనగర్ లోక్ సభ అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న అభ్యర్థుల్లో  అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి పేరు ముందు వరుసలో ఉండగా.. కొద్ది రోజుల్లోనే వెలిచాల రాజేందర్ రావు పేరు ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. నోటిఫికేషన్ తేదీనాటికి అన్ అఫిషీయల్ గా రాజేందర్ రావు పేరును ఖరారు చేసి, పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశాలకు కూడా ఆహ్వానించడంతో అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి వర్గీయుల్లో గందరగోళం నెలకొంది. అల్గిరెడ్డికి టికెట్ ఇవ్వకపోతే ఆయన రాజకీయ భవిష్యత్ గురించి అధిష్టానం నుంచి మరేదైనా హామీ ఉంటుందనే ధీమాలో వారు ఉన్నట్లు తెలిసింది. 

రెబల్​గా ప్రవీణ్​రెడ్డి..ఎల్లుండి నామినేషన్

కాంగ్రెస్ టికెట్ తనకు రావడం లేదని భావించిన అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ‌రెబల్​గా బరిలో నిలవనున్నట్లు తెలిసింది. కరీంనగర్​లో సోమవారం మంత్రి పొన్నం, ఎమ్మెల్యేలతో వెళ్లి కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు నామినేషన్ దాఖలు చేయడంతో ప్రవీణ్ రెడ్డి మనోవేదనకు గురైనట్లు సమాచారం. హుస్నాబాద్ అసెంబ్లీ టికెట్ ఇవ్వకుండా మోసం చేశారని, ఇప్పుడు లోక్ సభ టికెట్ విషయంలోనూ అలాగే చేశారని ఎన్నికల బరిలో నిలవాలని నిర్ణయించినట్లు తెలిసింది. 25న నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వర్గీయుల ద్వారా తెలిసింది.