ధాన్యం తరలింపుకు లేని లారీలు.. ఇసుకకు ఎక్కడివి?

ధాన్యం తరలింపుకు లేని లారీలు.. ఇసుకకు ఎక్కడివి?

కరీంనగర్:  ఎమ్మెల్సీ  ఎన్నికల క్యాంపు రాజకీయాలను అడ్డుకోవాలని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నట్లు కరీంనగర్ మాజీ మేయర్, ఎమ్మెల్సీ అభ్యర్థి సర్ధార్ రవీందర్ సింగ్ అన్నారు. ఓటింగ్ ను కెమెరాలతో రికార్డు చేస్తామని ప్రజాప్రతినిధులను మంత్రి ఎర్రబెల్లి బెదిరిస్తున్నారని ఆయన అన్నారు. ఓటింగ్ హాల్ లో కెమెరాలు పెట్టించే శక్తి ఆయనకు ఉండదని రవీందర్ సింగ్ అన్నారు. కరీంనగర్ లో ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో ఆయన పై వ్యాఖ్యలు చేశారు. 

‘మంత్రి ఎర్రబెల్లి ప్రజాప్రతినిధులను బెదిరిస్తున్నాడు. ఇది సీక్రెట్ ఓటింగా లేక నీ అయ్య జాగీరా.. కెమెరాలు పెట్టించే శక్తి నీకుండదు. కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను ప్రలోభాలతో పాటు బెదిరింపులకు గురిచేస్తున్నారు. ఖబర్ధార్ ఎర్రబెల్లి.. కరీంనగర్ వాళ్లతో పెట్టుకోకు. నీవు ఏనాడు ఉద్యమం చేయలేదు. అడ్డదారిలో వచ్చి మంత్రి అయ్యావు. క్యాంపులో ఉన్నవారిని జాగ్రత్తగా తీసుకువచ్చి ఓటు వేయించాలి. ఎన్నికలు సజావుగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. నేను నామినేషన్ వేసినప్పటి నుంచే కుట్రలు చేస్తున్నారు. నా నామినేషన్ రిజెక్ట్ చేయాలని కుట్రలు చేసినా పారలేదు. నా వల్లే ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతోంది. నేను పోటీలో లేకపోతే ఎన్నిక ఏకగ్రీవమయ్యేది. నేను పోటీలో ఉండటం వల్లే.. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవం దక్కుతోంది.  ఎమ్మెల్సీగా మూడో సారి పోటీ చేస్తున్న భాను ప్రసాద్ కు క్యాంపులో ఉన్న10 మంది ఓటర్ల పేర్లు కూడా తెలియదు. సీక్రెట్ ఓటింగ్ కాబట్టి... ప్రజాప్రతినిధులంతా నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. మీరంతా ఎలాంటి భయభ్రాంతులకు గురికాకుండా ఓటు హక్కు వినియోగించాలి. కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లాలోనూ చాలా మంది బాధితులు నన్ను కలిశారు. ప్రతిరోజు సిరిసిల్ల నుంచి ఎలాంటి అనుమతి లేకుండా 526 లారీల ఇసుకను హైదరాబాద్ కు తరలిస్తున్నారు. వరి పంట తరలించేందుకు లారీలు లేవని అధికారులు చెబుతున్నారు.. ఇసుకకు మాత్రం ఈ లారీలు ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఒక్కరోజు ఇసుక అక్రమ రవాణా ఆపితే.. 526 లారీల్లో ధాన్యం తరలించొచ్చు. ఉదయమే లేచి మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్లు మురికి కాలువల వెంట తిరగాలని కేసీఆర్ చెబుతుంటాడు.  మరి ఆయన కొడుకు కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ఉండి ఏనాడైనా మురికి కాలువలను పరిశీలించారా? గతంలో ఏనాడు సమయానికి మంజూరు కానీ ఎంపీటీసీ, జెడ్పీటీసీల వేతనాలు ఇప్పుడు.. ఠంచన్ గా విడుదలవుతున్నాయి. దీనికి కారణం నా నామినేషనే. నేను ప్రశ్నిస్తున్నా కాబట్టే డబ్బులు రిలీజ్ అయ్యాయి. నేను గెలిస్తే ఎన్నో సమస్యలు పరిష్కరామవుతాయి. నేను ఉద్యమకారుల తరపున పోటీ చేస్తున్నా.. నన్ను చంపుకుంటారో, సాదుకుంటారో మీ ఇష్టం.  పార్టీని వదిలేసి కూడా మీ కోసం పోటీ చేస్తున్నా.. నా బతుకంతా మీ చేతిలోనే ఉంది. కరోనా విజృంభిస్తున్నందున ఎమ్మల్సీ ఎన్నికల్లో సోషల్ డిస్టెన్స్ పాటించాలి. అధికారులు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుని పోలింగ్ బూతులను ఏర్పాటు చేయాలి. టీఆర్ఎస్ అభ్యర్థులకు ధనబలం, అధికారం తప్ప మరో అవకాశం లేదు.  అందుకే బెదిరించి ఓటు వేయించుకోవాలని చూస్తున్నారు. పోలింగ్ రోజు.. ఎలాంటి అక్రమాలు జరిగినా అధికారులదే బాధ్యత. 18 ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక్క సీటు కూడా మైనార్టీలకు ఇవ్వలేదు. నేను ఎమ్మెల్సీగా గెలిచాకా.. స్థానిక ప్రజాప్రతినిధుల సమస్యల పరిష్కారానికి పోరాడుతా.. లేదంటే పదవికి రాజీనామా చేస్తా. మీ గొంతుగా కౌన్సిల్ లో నిలదీస్తా. గ్రామపంచాయితీల్లో ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు కుర్చీ ఉండేలా చూస్తా. జాతీయ జెండా ఎగురవేయడానికి ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు అవకాశం ఉండాలి. భానుప్రసాద రావు ఏనాడైనా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులపై మాట్లాడినట్లు ఆధారాలు చూపిస్తే నేను పోటీ నుంచి తప్పుకుంటా. భాను ప్రసాద్ 12 ఏళ్లు ఎమ్మెల్సీగా ఉండి.. 12 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో మాట్లాడలేదు. గడిచిన 12 ఏళ్లలో భానుప్రసాద్ రావు 1000 కోట్ల ఆస్తులు సంపాదించుకున్నాడు. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారి. నాకు మొదటి ప్రాధాన్య ఓటు వేసి గెలిపిస్తే మీకోసం కొట్లాడుతా’ అని రవీందర్ సింగ్ అన్నారు.