పోలీసులు కేసీఆర్ ​రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు: బండి సంజయ్

పోలీసులు కేసీఆర్ ​రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు: బండి సంజయ్

న్యూఢిల్లీ, వెలుగు : ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో బీఆర్ఎస్-, ఎంఐఎంలు కలిసి విధ్వంసం సృష్టించాలనుకుంటున్నాయని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. ఎంఐఎం కార్యకర్తలు ర్యాలీగా వెళ్తూ కరీంనగర్​లోని తన ఇల్లు, ఆఫీస్ పై దాడికి యత్నిస్తే పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేని ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తలపై ఉల్టా కేసులు పెట్టడం ద్వారా సమాజానికి ఏ సంకేతాలు పంపుతున్నారని నిలదీశారు. ఈ మేరకు శనివారం ఢిల్లీ నుంచి ఒక వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. తామే నిజమైన దేశభక్తులమని,

తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తాము చెప్పినట్లే నడవాలంటూ ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ‘‘మీరు దేశభక్తులా.. ఏ దేశానికి? పాకిస్తాన్ కా... అఫ్గానిస్తాన్ కా?’’ అని ప్రశ్నించారు. మీరు నిజంగా దేశభక్తులే అయితే భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్దకు వచ్చి జాతీయ గీతమైన జనగణమన, వందేమాతరం గీతాలను ఆలపించాలంటూ సవాల్ విసిరారు. తమ ధైర్యాన్ని, సాహసాన్ని పిరికితనంగా భావిస్తే దారుస్సలాంపై జెండా ఎగురవేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్​, బీఆర్ఎస్​ అవకాశవాద పార్టీలని అన్నారు.

బద్నాం చేయాలని చూస్తున్నరు

బీఆర్ఎస్, -ఎంఐఎంలు మతం రంగు పులిమి బీజేపీని బద్నాం చేయాలని చూస్తున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. ‘పోలీస్ వ్యవస్థ కలుషితమైంది. కొందరు పోలీసులు ప్రమోషన్లు, పోస్టింగుల కోసం బీఆర్ఎస్ చెప్పుచేతల్లో ఉంటూ బీజేపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేసి కేసులు పెడుతున్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెడుతూ, రౌడీషీట్లు ఓపెన్ చేస్తున్నారు.’అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర పోలీసులు అంబేద్కర్ రాజ్యాంగం ఫాలో అవుతున్నారా? లేక కేసీఆర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా? అని ఫైర్ అయ్యారు.

చాకలి ఐలమ్మ వంటి తెలంగాణ సాయుధ పోరాట యోధుల దెబ్బకు ఎంఐఎం నేత ఖాసీం రిజ్వి పాకిస్తాన్ కు పారిపోయారన్నారు. పాతబస్తీలోని ముస్లిం మేధావులు కూడా ఎంఐఎం ఆగడాలను చీదరించుకుంటున్నారన్నారు. ముస్లిం మహిళలంతా మహిళా రిజర్వేషన్ బిల్లును, ట్రిపుల్ తలాఖ్ చట్టాన్ని వ్యతిరేకించిన ఎంఐఎం పార్టీని తరిమికొట్టాలని చూస్తున్నారని అన్నారు.