
కరీంనగర్ : వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో తమ నగరంలో 40కి పైగా డివిజన్లు టీఆర్ఎస్ వేనని, మేయర్ పదవి కూడా తామే గెలుచుకుంటామని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు కరీంనగర్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. కరీంనగర్ లో 60 డివిజన్లలో టీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని అన్నారు.
కరీంనగర్ మేయర్ పదవిని ఎంఐఎంకు ఇస్తామని బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని కమలాకర్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాపై బీజేపీ తెలంగాణ ఎంపీలు పార్లమెంటులో ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు . ఇప్పటికైనా ప్రాజెక్టు జాతీయ హోదా కోసం మాట్లాడాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కాంగ్రెస్ నేతలు పొన్నం, జీవన్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. మిడ్ మానేరుకు నీళ్లు ఎప్పుడు వస్తాయని, కరంటు బిల్లు ఎలా కడతారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనాలోచితంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ.. ఎస్సారెస్పీలో ఆగష్టు నాటికి 40 టీఎంసీలు ఉండాల్సిన నీళ్లు కేవలం 7.11 టీఎంసీ మాత్రమే ఉన్నాయన్నారు కమలాకర్. దీంతో ఎల్.ఎం.డి, మిడ్ మానేరు పరిస్థితి దారుణంగా ఉందన్నారు. మహారాష్ట్ర నుంచి దిగువకు నీరు వచ్చే పరిస్థితి లేదని,ఇలాంటి పరిస్థితుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు కరీంనగర్ జిల్లాకు ప్రాణధారం కానుందన్నారు. ఈ నెల 12 నాటికి కాళేశ్వరం నీరు మిడ్ మానేరు కు రాబోతోందన్నారు.లక్ష్మీపూర్ నుంచి కాలువ ద్వారా ఎల్.ఎం.డి.కి కూడా నీరు రాబోతోందని , మొదటి నీటి బొట్టు కరీంనగర్ చేరగానే భారీ ఎత్తున జలజాతర చేస్తామని కమలాకర్ అన్నారు.