వరదలొచ్చినప్పుడు మోదీ ఎక్కడ?

వరదలొచ్చినప్పుడు మోదీ ఎక్కడ?
  •     కర్నాటకలో కరువు వచ్చినప్పుడూ ఆయన రాలేదు: సీఎం సిద్ధరామయ్య 
  •     బెంగళూరును ట్యాంకర్ సిటీగా మార్చారన్న పీఎంపై సిద్ధూ ఫైర్ 
  •     రైతుల గురించి మాట్లాడే హక్కు మోదీకి లేదంటూ ట్వీట్  

బెంగళూరు :  కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం టెక్ సిటీ (బెంగళూరు)ని ట్యాంకర్ సిటీగా మార్చిందంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కామెంట్లపై ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య మండిపడ్డారు. రాష్ట్రం వరదలు, కరువుతో అవస్థలు పడినప్పుడు మోదీ ఎక్కడున్నారని ప్రశ్నించారు. శనివారం బెంగళూరులో జరిగిన ర్యాలీలో ప్రధాని చేసిన కామెంట్లకు ఆయన ట్విట్టర్ లో కౌంటర్ ఇచ్చారు.

‘‘దేశ ప్రజల కోసం 24x7 పని చేస్తున్నానని మోదీ అంటున్నారు. మరి కర్నాటకలో వరదలు, కరువు వచ్చినప్పుడు ఆయన ఎక్కడున్నారు? అంటే.. 24x7 అనేది కేవలం ప్రచారానికి చెప్తున్న మాటలాగే ఉంది” అని సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. రైతులను కాంగ్రెస్ మోసం చేసిందంటూ మోదీ చిక్కబళ్లాపూర్ లో చేసిన కామెంట్లనూ ఆయన ఖండించారు. మోదీ నిజంగా రైతులకు శ్రేయోభిలాషిగా ఉన్నారా? లేదా? అనేది తన మనస్సాక్షినే అడగాలన్నారు.

అగ్రిచట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన నిరసనల్లో 700 మంది రైతులు చనిపోయారని, రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు ప్రధానికి లేదన్నారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, ఫర్టిలైజర్స్, సీడ్స్ పై జీఎస్టీ ఎత్తివేత డిమాండ్లను నెరవేర్చేందుకు కేంద్రం ఇప్పటికీ సిద్ధంగా లేదన్నారు. రైతు వ్యతిరేకత అనేది బీజేపీ డీఎన్ఏలోనే ఉందని సిద్ధూ విమర్శించారు.