
కర్ణాటక డిప్యూటీ సీఎం గోవింద్ కర్జోల్ కొడుకు డాక్టర్ గోపాల్ కర్జోల్‌కు కరోనా కారణంగా ఆరోగ్యం విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. గత నెలలో కరోనా బారినపడిన గోపాల్ 24 రోజుల పాటు బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. కరోనా వచ్చిన రెండో రోజు నుంచే ఆరోగ్యం విషమించింది. దీంతో గోపాల్‌కు 23 రోజుల పాటు వెంటిలేటర్‌పైనే చికిత్స అందించారు డాక్టర్లు. అయినప్పటికీ ఆయన ఆరోగ్యం ఏ మాత్రం మెరుగుపడలేదు. దీంతో బెంగళూరు వైద్యులు ఆయనను హైదరాబాద్‌కు తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. అయితే ప్రస్తుతం బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో ఉన్న బాగల్‌కోట్, కలబుర్గిల్లో వరదల వల్ల రోడ్డు మార్గంలో తీసుకెళ్లడం కుదరలేదని కర్ణాటక డిప్యూటీ సీఎం గోవింద్ కర్జోల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. గోపాల్‌కు ఉన్న వెంటిలేటర్ సపోర్ట్ అలాగే ఉంచి హైదరాబాద్ తరలించాల్సి రావడంతో ఎయిర్ అంబులెన్స్‌లో షిఫ్ట్ చేశామని తెలిపారు. గోపాల్ కర్జోల్ ఆరోగ్యం మరింత విషమిస్తే లంగ్స్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాల్సి వస్తుందని వైద్యులు చెప్పారని గోవింద్ వెల్లడించారు.
కర్ణాటకలో గత నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల సమయంలో డిప్యూటీ సీఎం గోవింద్ కర్జోల్ సహా పలువురు మంత్రులకు కరోనా వైరస్ సోకింది. గోవింద్ కర్జోల్ నుంచి ఆయన కుటుంబంలో అందరికీ వైరస్ అంటుకుంది. 24 రోజులుగా తన పెద్ద కుమారుడు డాక్టర్ గోపాల్ కర్జోల్ వెంటిలేటర్‌పైనే చికిత్స పొందుతున్నాడు. గోవింద్ కర్జోల్ భార్య ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నారు. 19 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స తర్వాత గోవింద్ కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.