భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత వివాదాస్పద చిత్రాల్లో ఒకటిగా నిలిచిన మూవీ 'ది కేరళ స్టోరీ'. ఈ సినిమా మొదటి భాగం సృష్టించిన ప్రకంపనలు ఇంకా చల్లారకముందే.. ఇప్పుడు దాని సీక్వెల్ 'ది కేరళ స్టోరీ-2' మరోసారి దేశవ్యాప్తంగా రాజకీయ మంటలను రాజేస్తోంది. ఫిబ్రవరి 27న విడుదల కానున్న ఈ చిత్రంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది సినిమా కాదని, కేరళ ప్రతిష్టను ప్రపంచం ముందు దిగజార్చడానికి పన్నిన ఒక ‘విద్వేషపూరిత ప్రోపగాండా’ అని అభివర్ణించారు.
సీఎం సీరియస్..
అక్షరాస్యతలో, సామాజిక అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచిన కేరళను ఉగ్రవాదానికి కేంద్రంగా చిత్రీకరించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది ముఖ్యమంత్రి విజయన్ ఆరోపించారు. దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు, హోం మంత్రిత్వ శాఖ సైతం గతంలో తోసిపుచ్చిన ‘లవ్ జిహాద్’ అంశాన్ని మళ్లీ తెరపైకి తీసుకురావడం మతపరమైన విభజన కోసమేనని ఆయన మండిపడ్డారు. శాంతియుత వాతావరణం కలిగిన కేరళను అప్రతిష్టపాలు చేసే ఇటువంటి చిత్రాలను ప్రజలు ఐక్యంగా తిరస్కరించాలని ఆయన పిలుపునిచ్చారు.
రాజకీయ ఐక్యత
సాధారణంగా రాజకీయంగా విభేదించే అధికార ఎల్.డి.ఎఫ్ (LDF), ప్రతిపక్ష కాంగ్రెస్ (UDF) ఈ సినిమా విషయంలో ఒక్కటయ్యాయి. కేరళ సమాజాన్ని చీల్చే ప్రయత్నంగా భావిస్తున్న ఈ చిత్రంపై అటు కాంగ్రెస్ నేతలు కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ఉన్న ఈ సినిమాపై అప్రమత్తంగా ఉండాలని వారు ప్రజలను కోరుతున్నారు. ఈ చిత్రాలు సంఘ్ పరివార్ అజెండాను ప్రచారం చేస్తున్నాయని, పరస్పర అంగీకారంతో జరిగే వివాహాలను కూడా మతమార్పిడులుగా చిత్రీకరిస్తూ విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతం పునరావృతమవుతుందా?
మొదటి భాగం విడుదలైనప్పుడు కూడా ఇలాంటి అభ్యంతరాలే వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా 32 వేల మంది మహిళలు మతం మారారు అనే గణాంకంపై తీవ్ర యుద్ధమే నడిచింది. ఇప్పుడు రెండో భాగంలో కేరళతో పాటు ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న మత మార్పిడి అంశాలను చూపిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో వివాదం కేరళ సరిహద్దులు దాటి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు, చిత్ర నిర్మాత విపుల్ అమృత్‌లాల్ షా, దర్శకుడు కామాఖ్యా నారాయణ్ సింగ్ తమ వాదనను వినిపిస్తున్నారు. కళాకారులకు వాస్తవాలను చెప్పే హక్కు ఉంటుందని, సమాజంలోని చేదు నిజాలను చూపించడమే తమ ఉద్దేశమని వారు చెబుతున్నారు. కళా స్వేచ్ఛకు, సామాజిక బాధ్యతకు మధ్య జరుగుతున్న ఈ పోరులో ‘ది కేరళ స్టోరీ-2’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ఒకవైపు విమర్శలు, మరోవైపు సెన్సార్ బోర్డు నిర్ణయాల మధ్య ఈ ఫిబ్రవరి 27న సినిమా విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుందా.. లేక వివాదాల సుడిగుండంలో చిక్కుకుంటుందా అన్నది వేచి చూడాలి..
