అసెంబ్లీ ఎన్నికల ముందు తమిళనాట రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. దక్షిణాదిలో పాగా వేసేందుకు ఎన్డీఏ ప్లాన్ చేస్తున్న తరుణంలో.. అక్కడ కొత్తగా పొడిచిన పొత్తు ఆ కూటమికి బిగ్ షాక్ ఇచ్చింది. నటుడు, దివంగత నేత కెప్టెన్ విజయ్ కాంత్ కు చెందిన DMDK పార్టీ డీఎంకే పార్టీతో పొత్తుపెట్టుకోవడం సంచలనంగా మారింది.
డీఎండీకే పార్టీ జనరల్ సెక్రటరీ ప్రేమలతా విజయ్ కాంత్.. DMK అధినేత, తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్ ను గురువారం (ఫిబ్రవరి 09) కలిశారు. సీఎం ఆహ్వానం మేరకు హెడ్ క్వార్టర్స్ లో స్టాలిన్ ను కలిసిన ఆమె.. పొత్తుకు అంగీకరించినట్లు ప్రకటించారు. డీఎండీకే స్థాపించిన 2005 నుంచి.. డీఎంకేతో పొత్తు పెట్టుకోవడం ఇదే తొలిసారి.
అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి గెలుపే లక్ష్యంగా అలయన్స్ ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలిపారు. సీట్ షేరింగ్ కు సంబంధించిన విషయాలు చర్చల తర్వాత స్పష్టత వస్తుందని ప్రేమలతా విజయ్ కుమార్ తెలిపారు.
DMDK చేరికతో తమిళనాడులో DMK ప్రభుత్వ పాలన కొనసాగింపుకు దోహదపడుతుందని ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. డీఎండీకే కు రాజ్యసభ స్థానం లభించే చాన్స్ ఉంది. సీఎం అధికారికంగా ప్రకటిస్తారని ప్రేమలత తెలిపారు.
తమిళనాడులో పొడిచిన కొత్త పొత్తు.. ఆ రాష్ట్రంలో డీఎంకే ను మరింత బలోపేతం చేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కూటమికి 200 సీట్లకు పైగా గెలుచుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. తమిళనాడులో పాగా వేయాలనుకున్న ఎన్డీఏ కూటమికి ఇది భారీ ఎదురుదెబ్బగా చెబుతున్నారు.
డీఎండీకే తమ కూటమిలో చేరడం స్టాలిన్ కు కలొసొచ్చే అంశం. ఇప్పటి వరకు డీఎంకే వ్యతిరేక కూటమిలో ఉంటూ వస్తున్న DMDK చేరడంతో స్టాలిన్ మరింత బలపడనున్నారు. 2011 నుంచి DMDK అన్నాడీఎంకే కూటమితో ఉంటూ వస్తోంది.
Chennai | After meeting DMK chief MK Stalin, DMDK General Secretary Premalatha Vijayakanth says, "We have sealed an alliance with DMK. Our party cadres also wished for this alliance. It should have been formed when Captain Vijayakanth was alive. The number of seats will be… pic.twitter.com/t13vl6jpKa
— ANI (@ANI) February 19, 2026
విజయ్ కాంత్ స్థాపించిన DMDK పార్టీకి సెంట్రల్ తమిళనాడులో బాగా పట్టుంది. తిరుచిరాపల్లి, పుదుక్కొట్టై చుట్టుపక్కల ప్రాంతాల్లో పార్టీకి ఫాలోయింగ్ ఉంది. కానీ 2011 తర్వాత పార్టీ సీట్లు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ఆ ఏడాదిలో 7.9 శాతం ఓట్లతో 29 సీట్లు గెలుచుకున్న పార్టీ.. 2016, 21 లో పూర్తిగా ఢీలా పడిపోయింది.
ప్రస్తుతం డీఎంకే అలయన్స్ లో కలవటంతో ఇటు కాంగ్రెస్, డీఎంకే కూటమికి మరోసారి విజయం తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
DMDK పార్టీని నటుడు, కెప్టెన్ విజయ్ కాంత్ 2005 లో స్థాపించిన విషయం తెలిసిందే. 2023 లో అనారోగ్య కారణాలతో ఆయన మృతి చెందారు. అప్పటి నుంచి ఆయన సతీమణి ప్రేమలత విజయ్ కాంత్ పార్టీని నడినిపిస్తూ వస్తున్నారు. కెప్టెన్ లేనప్పటికీ ఆయనపైన ఉన్న అభిమానంతో.. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ పార్టీకి ఆధరణ కొనసాగుతూనే ఉంది.
