కామారెడ్డి జిల్లాలో గవర్నమెంట్ స్కూల్ స్థలం ఆక్రమించిన ఉప సర్పంచ్... హైకోర్టు కీలక ఆదేశాలు..

కామారెడ్డి జిల్లాలో గవర్నమెంట్ స్కూల్ స్థలం ఆక్రమించిన ఉప సర్పంచ్... హైకోర్టు కీలక ఆదేశాలు..

కామారెడ్డి జిల్లా ముత్యంపేట్ గ్రామంలో గవర్నమెంట్ స్కూల్ స్థలంలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చేశారు అధికారులు. జిల్లాలోని దోమకొండ మండలం ముత్యంపేట్ గ్రామంలో ఉప సర్పంచ్ అయిన శిరీష్ గౌడ్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన స్థలాన్ని ఆక్రమించారంటూ హైకోర్టును ఆశ్రయించారు గ్రామస్థులు. పాఠశాలకు చెందిన స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకొని నిర్మాణాలు చేపట్టారంటూ ఫిర్యాదు చేశారు గ్రామస్థులు. ఈ క్రమంలో అక్రమ నిర్మాణాలను కూల్చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.

గతంలో ఈ స్థలాన్ని ఒక దాత పాఠశాలకు విరాళంగా ఇచ్చారని.. ఈ స్థలాన్ని పలువురి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించిన శిరీష్.. ఆ తర్వాత ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపిస్తున్నారు గ్రామస్తులు. ఈ స్థలం విషయంలో శిరీష్ కు తమకు మధ్య గొడవలు కూడా జరిగాయని తెలిపారు గ్రామస్తులు.

ఈ కేసు విచారణ చేపట్టిన హైకోర్టు అక్రమ నిర్మాణాల కూల్చివేతకు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు జేసీబీలతో అక్రమ నిర్మాణాలు కూల్చేశారు. హైకోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు ఉప సర్పంచ్ శిరీష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.