India–Bangladesh: భద్రతా కారణాలను చూపుతూ బంగ్లాదేశ్ 2026 టీ20 ప్రపంచ కప్ కోసం భారతదేశానికి రావడానికి నిరాకరించింది. దీంతో తమ మ్యాచ్ లను శ్రీలంకకు మార్చాలనే బంగ్లా ప్రతిపాదనను ఐసీసీ తిరస్కరించడంతో పాటు టోర్నీ నుంచి తప్పించి స్కాట్లాండ్ జట్టును మెగా ఈవెంట్లో ఆడించింది. బంగ్లాదేశ్ లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆ దేశ క్రికెట్ లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భారత్‌తో క్రికెట్ సంబంధాలను మళ్లీ మెరుగుపరుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. రాబోయే రోజుల్లో భారత్– బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లపై స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. ఎన్నికల తర్వాత అమీనుల్ హక్ బంగ్లాదేశ్ కొత్త క్రీడల శాఖ మంత్రిగా ఎన్నికయ్యారు. పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన ఇండియాతో సంబంధాలు మెరుగుపర్చే ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. భారత జట్టు బంగ్లాదేశ్‌కు వస్తే, బంగ్లా క్రికెట్ బోర్డుకు భారీ ఆదాయం వస్తుందని అమినుల్ హాక్‌కు తెలుసు.. కాబట్టి, బీసీసీఐతో చర్చలు జరపాలని నిర్ణయించారు. ఈ క్రమంలో భారత డిప్యూటీ హై కమిషనర్‌తో స్నేహపూర్వకంగా సమావేశం అయ్యారు.
ఐసీసీ రూల్స్ ఫాలో అవుతాం:
ఈ సందర్భంగా బంగ్లాదేశ్ కొత్త క్రీడల మంత్రి అమినుల్ హాక్ మాట్లాడుతూ.. మంత్రిగా పదవి చేపట్టిన వెంటనే భారత్ డిప్యూటీ హై కమిషనర్‌ను కలిశాను.. ఇరు దేశాల మధ్య నెలకొన్న సమస్యలను స్నేహపూర్వకంగా చర్చించి పరిష్కరించుకోవాలని మాట్లాడాం.. తాము పొరుగు దేశాలతో మంచి సంబంధాలు కొనసాగించాలని అనుకుంటున్నాం.. అందుకే, క్రికెట్ విషయంలో ఐసీసీ నిబంధనల ప్రకారం చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించాడు.
ఆస్ట్రేలియాకు బీసీబీ చీఫ్ బుల్బుల్ జంప్:
బీఎన్‌పీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ అమీనుల్ ఇస్లాం బుల్బుల్ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఆయన ఆస్ట్రేలియాకు పారిపోయారు. అక్కడే తన కుటుంబంతో కలిసి నివసించనున్నారు. ఈ విషయంపై స్పందించిన అమినుల్ హాక్.. గత బీసీబీ ఎన్నికలపై సందేహాలు ఉన్నాయని అన్నారు. ఇకపై సరైన విధానాలు పాటిస్తూ, అందరితో చర్చించిన తర్వాతే తుది నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.
షకీబ్, మష్రఫే రీఎంట్రీపై ఆశ:
అమినుల్ హాక్ మరో కీలక అంశంపై కూడా మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ క్రికెట్‌కు షకీబ్ అల్ హసన్, మష్రఫే మోర్తజా మళ్లీ ఆడాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. షకీబ్ గత రెండేళ్లుగా బంగ్లాదేశ్‌కు రాలేదు.. మష్రఫే మోర్తజా కూడా షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత బయట కనిపించలేదన్నారు. వీరు ఇద్దరూ షేక్ హసీనా గత ప్రభుత్వంలో ఎంపీలుగా కూడా పని చేశారు.
