'జియో బ్రెయిన్'తో ముకేశ్ అంబానీ మాస్టర్ ప్లాన్.. AIపై 7 ఏళ్లలో రూ. 10 లక్షల కోట్ల మెగా ఇన్వెస్ట్మెంట్..

'జియో బ్రెయిన్'తో ముకేశ్ అంబానీ మాస్టర్ ప్లాన్.. AIపై 7 ఏళ్లలో రూ. 10 లక్షల కోట్ల మెగా ఇన్వెస్ట్మెంట్..

ఢిల్లీలో జరుగుతున్న  ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చేసిన ప్రసంగం భవిష్యత్తుపై ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కేవలం ఒక సాంకేతిక మార్పు మాత్రమే కాదు.. అది మానవ చరిత్రలోనే ఒక కొత్త శకాన్ని సృష్టించబోతోందని అంబానీ బలంగా విశ్వసించారు. భారత్ కేవలం ఏఐ యూజర్‌గా మాత్రమే మిగిలిపోకూడదని.. ప్రపంచ ఏఐ శక్తిగా ఎదగాలన్నదే తన ఆకాంక్షని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రిలయన్స్ జియో తరపున భారీ పెట్టుబడులను, వ్యూహాత్మక ప్రణాళికలను బయటపెట్టింది.

అంబానీ తన ప్రసంగంలో 'సావరిన్ ఏఐ' ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. భారతదేశ డేటా మన దేశంలోనే ఉండాలని.. దాని ద్వారా అభివృద్ధి చెందే ఏఐ మోడల్స్ కూడా భారతీయ భాషలు, సంస్కృతిని ప్రతిబింబించాలని పేర్కొన్నారు. ఇందుకోసం జియో ప్లాట్‌ఫామ్స్ ద్వారా 'జియో బ్రెయిన్' అనే ఏఐ ప్లాట్‌ఫామ్‌ను మరింత విస్తరిస్తున్నట్లు తెలిపారు. ఇది హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని, ముఖ్యంగా సామాన్యులకు ఏఐ సేవలను అందుబాటులోకి తెస్తుందని అంబానీ ధీమా వ్యక్తం చేశారు.

భవిష్యత్తులో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం గురించి వస్తున్న ఆందోళనలను కూడా ఈ సందర్భంగా అంబానీ తోసిపుచ్చారు. ఏఐ అనేది ఉద్యోగాలను హరించేది కాదని, మానవ సామర్థ్యాన్ని రెట్టింపు చేసే అద్భుతమైన టూల్ అని అభివర్ణించారు. గతంలో కంప్యూటర్లు వచ్చినప్పుడు కూడా ఇలాగే భయపడ్డారు.. కానీ అవి కోట్లాది కొత్త అవకాశాలను సృష్టించాయని చెప్పారు. ఇప్పుడు ఏఐ కూడా ప్రతి భారతీయుడిని ఒక 'సూపర్ హ్యూమన్'గా మారుస్తుంది అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏఐ వల్ల ప్రొడక్టివిటీ పెరగడమే కాకుండా.. కొత్త తరహా పరిశ్రమలు పుట్టుకొస్తాయని ఇది భారతదేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి ప్రధాన ఎనర్జీగా మారుతుందని అంబానీ అంటున్నారు.

పెట్టుబడుల విషయానికి వస్తే.. గ్రీన్ ఎనర్జీ, ఏఐ కలయికతో కొత్త డేటా సెంటర్ల నిర్మాణానికి జియో భారీగా నిధులు వెచ్చిస్తోంది. ఎన్విడియా వంటి అంతర్జాతీయ సంస్థలతో కలిసి అత్యాధునిక ఏఐ సూపర్ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలను భారత్‌లో నిర్మిస్తోంది. ఈ సమ్మిట్‌లో అంబానీ మాటలను బట్టి చూస్తే.. జియో కేవలం టెలికాం సంస్థగానే కాకుండా ఒక 'డీప్-టెక్' పవర్‌హౌస్‌గా మారబోతోందని స్పష్టమవుతోంది. ఏఐ విప్లవంలో భారత్ వెనుకబడి ఉండదు, బదులుగా ప్రపంచానికి నాయకత్వం వహిస్తుంది అనే అంబానీ నినాదం ప్రతినిధుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. దేశంలో ఏఐ ఇన్ ఫ్రా కోసం ఇప్పటి నుంచి రానున్న 7 ఏళ్లలో 10 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయటానికి రిలయన్స్ గ్రూప్ సిద్ధంగా ఉందని చెప్పారు. సామాన్యులకు ఏఐ ఫలాలను జియో ద్వారా తక్కువ ఖర్చుకే తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు అంబానీ.