
- కర్నాటకలో రిజల్ట్స్..ఇక్కడ టెన్షన్!
- ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్
- హోరాహోరీ పోరు తప్పదన్న అంచనాలతో నేతల్లో హైరానా
- బీజేపీ, కాంగ్రెస్‌లో ఏది గెలిచినా ఆ పార్టీకి రాష్ట్రంలో ఫుల్ జోష్
- అక్కడి ప్రభావం ఇక్కడ పడుతుందనే భావనలో బీఆర్ఎస్
హైదరాబాద్, వెలుగు: కర్నాటక ఎలక్షన్.. తెలంగాణ రాజకీయాల్లో టెన్షన్ పుట్టిస్తున్నది. కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ మధ్య ముక్కోణపు పోటీలో ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపుతరు? ఏకపక్షమేనా? హంగ్ వస్తదా? అనే ఉత్కంఠ నెలకొన్నది. శనివారం మధ్యాహ్నానికి కర్నాటక అసెంబ్లీ ఎన్నికల విజేత ఎవరో తేలిపోనుంది. కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు తప్పదన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో.. తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ నేతల్లో హైరానా కనిపిస్తున్నది. పైగా ఇక్కడి నుంచి కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నేతలు వెళ్లి తమ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం కూడా చేశారు. మరోవైపు కన్నడ ఫలితం కోసం బీఆర్ఎస్ నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర సరిహద్దును ఆనుకునే కర్నాటక ఉండటం, ఐదారు నెలల్లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు రానుండటంతో ఆ ప్రభావం రాష్ట్రంపైనా పడుతుందని భావిస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికలకు దారి..
దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్నాటక. 2018లో జరిగిన ఎన్నికల్లో సింగిల్లార్జెస్ట్పార్టీగా బీజేపీ అవతరించినా.. కాంగ్రెస్, జేడీఎస్కలిసి అధికార పగ్గాలు దక్కించుకున్నాయి. తర్వాత కాంగ్రెస్ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. కొన్నాళ్లకు బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో కర్నాటకలో ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డింది. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ చీఫ్జేపీ నడ్డా సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ప్రచారం చేశారు. కర్నాటకలో గెలిచి వచ్చే సార్వత్రిక ఎన్నికలకు పాజిటివ్మూడ్తో వెళ్లాలని కాంగ్రెస్ఎత్తులు వేసింది. రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌జోడో యాత్ర కర్నాటకలో ఎక్కువ రోజులు సాగడం, బొమ్మై సర్కారుపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఓటర్లు తమవైపే చూశారని కాంగ్రెస్ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సొంత రాష్ట్రం కావడం, సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ సహా పార్టీ ముఖ్య నేతలంతా ప్రచారం చేయడంతో ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే నమ్మకంతో హస్తం పార్టీ ఉంది. మెరుగైన సీట్లు సాధించి కింగ్మేకర్అవుతామని జేడీఎస్ లెక్కలు వేసుకుంటోంది.
అక్కడ గెలిస్తే.. ఇక్కడ జోష్
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలో ఏ పార్టీ గెలిచినా తెలంగాణలోని ఆ పార్టీకి కొత్త జోష్ రావడం ఖాయం. కర్నాటకలో గెలిచేది తామంటే తామేనని ఆ రెండు పార్టీల నేతలు ధీమాగా చెప్తున్నా.. వారిలో లోలోపల ఆందోళన కనిపిస్తున్నది. ప్రాంతాల వారీగా కర్నాటకలో ఎక్కడెక్కడ ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు పోల్అయ్యాయి? రిజల్ట్ ఎలా ఉండబోతున్నదనే అంచనాలు వేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ నేతలు పాత హైదరాబాద్–కర్నాటక పరిధిలోనే ప్రచారం చేసినా ఇతర ప్రాంతాల్లో పార్టీ పరిస్థితిపై తమకు తెలిసిన లీడర్లు, సర్వే సంస్థలను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. బీఆర్ఎస్చీఫ్కేసీఆర్, ఆ పార్టీ ముఖ్య నేతలు సైతం కన్నడ ప్రజల పల్స్ ఎలా ఉంటుందా అని ఆరా తీస్తున్నారు. అక్కడ కాంగ్రెస్, బీజేపీల్లో ఏ పార్టీ గెలిచినా ఆ ప్రభావం తెలంగాణపై పడుతుందని కేసీఆర్ అంచనా వేస్తున్నారు. అక్కడ గెలిచిన ఊపులో తెలంగాణలో ఆయా పార్టీలు ప్రచారంలో జోష్ పెంచుతాయని, ఇతర పార్టీల నుంచి చేరికలు ఊపందుకుంటాయని లెక్కలు వేస్తున్నారు. నియోజకవర్గ స్థాయిలో గ్రూపు రాజకీయాలు ఎక్కువగా ఉండటంతో తమ పార్టీ నుంచి వలసలు ఉండొచ్చని కేసీఆర్ భావిస్తున్నారు. అక్కడి ప్రభావం తమ పార్టీపై ఎక్కువగా పడకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే ఆలోచనలో గులాబీ బాస్ఉన్నట్టు తెలుస్తున్నది.
వందల కోట్ల బెట్టింగ్
కర్నాటక ఎన్నికల ఫలితాలపై హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే ఎక్కువ మంది బెట్టింగ్ పెట్టినట్టుగా సమాచారం. కాంగ్రెస్ గెలిస్తే రూ.లక్షకు లక్ష ఇచ్చేలా బుకీలతో పందెం రాయుళ్లు ఒప్పందం చేసుకుంటున్నారు. బీజేపీ గెలుపుపైనా పెద్ద ఎత్తున పందేలు కాస్తున్నారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి (స్పెసిఫిక్నంబర్)? జేడీఎస్ ఎలాంటి రోల్ ప్లే చేయబోతున్నది? హంగ్ వస్తే సీఎం ఎవరు? సహా పలు అంశాలపై పందేలు కాస్తున్నారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్, బసవరాజ్ బొమ్మై, కుమారస్వామిలలో ఎవరు సీఎం అవుతారు? ఈ నలుగురు కాకుండా ఇంకెవరికైనా చాన్స్ ఉందా? అనే దానిపైనా పందేలు కాస్తున్నారు. తెలంగాణవ్యాప్తంగా కర్నాటక ఎన్నికల ఫలితాలపై రూ.3 వేల కోట్ల వరకు బెట్టింగ్‌లు కాసినట్టు అంచనా.