కేసీఆర్‌ హామీలిచ్చుడే తప్ప.. అమలు చేస్తలె

కేసీఆర్‌ హామీలిచ్చుడే తప్ప.. అమలు చేస్తలె
  • టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ ఆరోపణ
  • వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ కనుమరుగవుతుందని వెల్లడి
  • సర్కారు వైఫల్యాలపై ఇందిరా పార్కు వద్ద టీడీపీ మహాధర్నా

హైదరాబాద్, వెలుగు: అధికారంలోకి వచ్చి తొమ్మిదిన్నర ఏండ్లయినా ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్‌‌ ప్రభుత్వం నెరవేర్చలేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆరోపించారు. ప్రజలకు హామీలిచ్చుడు తప్ప అమలు చేయని బీఆర్‌‌ఎస్‌ సర్కార్‌‌ రాబోయే ఎన్నికల్లో కనుమరుగవడం ఖాయమన్నారు. సోమవారం బీఆర్‌ఎస్‌ సర్కారు ఇచ్చిన హామీలు, వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఇందిరా పార్కు వద్ద పార్టీ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా కాసాని మాట్లాడుతూ.. మిగులు రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్‌ అప్పుల తెలంగాణగా మార్చారని ఆరోపించారు. గత తొమ్మిదిన్నర ఏండ్లలో రూ.11 లక్షల కోట్లు అప్పు చేసి, ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేకుండా చేశారన్నారు. కానీ నాయకుల దగ్గర మాత్రం వందల కోట్లు ఉన్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్‌ పార్టీకి సొంత కేడర్‌ లేదని, ఆ పార్టీలో ఉన్నవారంతా టీడీపీ వారేనన్నారు. తెలుగుదేశం చెప్పిందే చేస్తుందని, ఎన్టీఆర్ హయాంలో రూ.2కే కిలో బియ్యం ఇచ్చారని, పేదలకు పక్కా ఇండ్లు, జనతా వస్త్రాలు, మహిళలకు ఆస్తి హక్కు ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారని గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక వనరులు పెంచిన ఘనత టీడీపీ అధినేత చంద్రబాబుదేనని పేర్కొన్నారు. 

ధరణిలో లోపాలు ఎంత చెప్పినా తక్కువే..

ఎన్నికలు వస్తున్నాయనే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్‌ ఇండ్లు పంచుతున్నారని కాసాని విమర్శించారు. నిరుద్యోగులకు భృతి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ధరణిలో ఉన్న లోపాల గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు. ప్రజల భూములు ధరణిలో లేవని, ఎమ్మార్వో , ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయల్లో లక్షల్లో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వం తీరు అధ్వాన్నంగా ఉందని, మొద్దు నిద్రలో ఉన్న సర్కార్‌‌ కళ్లు తెరిపించేందుకే మహా ధర్నా చేపట్టినట్లు తెలిపారు. ప్రజల అవసరాలకు వినియోగించాల్సిన ప్రభుత్వ భూములను ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించారు. అభివృద్ధి పనుల కోసం ఎక్కడ చూసినా శిలాఫలకాలు వేస్తున్నారే తప్ప, కేటాయిస్తున్న బడ్జెట్ మాత్రం జీరో అని ఎద్దేవా చేశారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా ప్రజలు సైకిల్‌కే ఓట్లు వేస్తారని, ఈసారి తెలుగుదేశానికి అండగా నిలబడాలని ప్రజలు నిర్ణయం తీసుకున్నారని జ్ఞానేశ్వర్ స్పష్టం చేశారు. మహా ధర్నాలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్, జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు బంటు వెంకటేశ్వర్లు, జాతీయ అధికార ప్రతినిధి టి.జ్యోత్స్న, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.