ఇండ్లు విడిచి వెళ్లినోళ్లు తిరిగి రావొచ్చు : కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా

ఇండ్లు విడిచి వెళ్లినోళ్లు తిరిగి రావొచ్చు : కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా

పూంచ్/జమ్మూ: ​ బార్డర్​లో ఇటీవల చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇండ్ల నుంచి వెళ్లిపోయిన వారు తిరిగి రావొచ్చని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చెప్పారు. భారత్‌, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ప్రజలు తిరిగి రావొచ్చని ఆయన ప్రకటించారు. కాల్పులు జరుగుతున్నప్పుడు పూంచ్ టౌన్​ నుంచి 80 నుంచి 90 శాతం మంది తమ ఇండ్లను విడిచిపెట్టి వెళ్లారని, ఇప్పుడు కాల్పులు ఆగిపోయినందున, వారు తమ ఇళ్లకు తిరిగి రావచ్చని తెలిపారు.

పూంచ్, సురాన్‌‌‌‌కోట్ ప్రాంతాల్లో పాకిస్తాన్ కాల్పుల వల్ల ప్రభావితమైన వారిని సోమవారం అబ్దుల్లా పరామర్శించారు. ఈ ప్రాంతంలో బంకర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కాల్పులతో పూంచ్ జిల్లా ఎక్కువగా ప్రభావితమైందని పేర్కొన్నారు. ‘‘గత మూడు-నాలుగు రోజులుగా, జమ్మూకాశ్మీర్‌‌‌‌లో ఒక రకమైన యుద్ధం లాంటి వాతావరణం ఉంది. సరిహద్దు షెల్లింగ్ భారాన్ని ఎదుర్కొన్న అన్ని ప్రాంతాలలో, పూంచ్ అత్యంత ప్రభావితమైంది’’ అని అన్నారు. పట్టణాల మధ్యలో షెల్స్​పడటం, భారీ బాంబు దాడులు జరగడం ఇదే మొదటిసారి అని చెప్పారు. తాము 13 మంది ప్రాణాలను కోల్పోయామని వెల్లడించారు.