ఉగ్రదాడిలో అమరుడైన పోలీస్‌కు అశోక చక్ర

ఉగ్రదాడిలో అమరుడైన పోలీస్‌కు అశోక చక్ర

న్యూఢిల్లీ: యాంటీ టెర్రిస్టులు ఆపరేషన్లలో వీరోచితంగా పోరాడి అమరులైన ఇద్దరు పోలీసులకు 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశ అత్యున్నత శౌర్య పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జమ్ము కశ్మీర్‌‌ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పని చేసిన ఏఎస్‌ఐ బామూ రామ్‌కు అశోక చక్ర పురస్కారాన్ని, కానిస్టేబుల్ అల్తాఫ్ హుస్సేన్ భట్‌కు కీర్తి చక్ర పురస్కారాన్ని అనౌన్స్ చేసింది. అశోక చక్ర దేశ తొలి అత్యున్నత శౌర్య పురస్కారం కాగా, కీర్తి చక్ర రెండో అత్యున్నత శౌర్య పురస్కారం. ఇక స్పెషల్ పోలీస్ ఆఫీసర్ షాబజ్ అహ్మద్‌కు శౌర్య చక్ర అవార్డును కేంద్రం ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం 144 మంది జవాన్లు, పోలీసులకు గ్యాలెంటరీ పురస్కారాలను ప్రకటించింది.

28 మంది టెర్రరిస్టులు హతం

జమ్ములోని పూంచ్ జిల్లా ధారణ గ్రామంలో 1972 మే 15న జన్మించిన బాబూ రామ్‌ చిన్నప్పటి నుంచే ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో చేరాలని ఆశయంగా పెట్టుకున్నాడు. 1999లో జమ్ము కశ్మీర్‌‌ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరాడు. మూడేండ్లకే 2002 జులై 27న శ్రీనగర్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్‌లో  పోస్టింగ్ పొందాడు. ఆ తర్వాత ఏఎస్‌ఐగా ప్రమోషన్ వచ్చింది. బాబూ రామ్‌ కశ్మీర్‌‌లో అనేక యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్లలో పాల్గొన్నాడని జమ్ము కశ్మీర పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. అతడి సర్వీస్ టైమ్‌లో మొత్తం 14 ఎన్‌కౌంటర్లలో పాల్గొన్నాడని, ఆయా ఆపరేషన్లలో 28 మంది టెర్రరిస్టులు హతమయ్యారని తెలిపారు. కశ్మీర్‌‌లో జరిగిన ఓ యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్‌లో బాబూ రామ్ అమరుడయ్యాడని, అతడికి అశోక చక్ర ప్రకటించి ప్రభుత్వం ఘనమైన నివాళి అర్పించిందని అన్నారు.

రక్షణగా ఉన్న సెక్యూరిటీని కాపాడబోయి..

శ్రీనగర్‌‌లోని సఫాకదల్‌కు చెందిన  కానిస్టేబుల్ అల్తాఫ్​ హుస్సేన్‌ భట్‌ గందేర్‌‌బాల్‌లో ఏరియాలో పీఎస్‌వో విధుల్లో ఉండగా అమరుడయ్యాడు. అల్తాఫ్‌కు రక్షణగా ఒక ప్రొటెక్టెడ్ పర్సన్ కూడా ఉండేవాడు. అయితే గత ఏడాది అక్టోబర్‌‌ 6న ఉగ్రవాదులు దాడి చేసిన సమయంలో కౌంటర్ అటాక్‌కు దిగారు. హోరాహోరా కాల్పులు జరుగుతున్న సమయంలో తనకు రక్షణగా ఉన్న ఆ వ్యక్తిని కాపాడేందుకు దూసుకెళ్లి ఉగ్రవాదుల తూటాలకు అడ్డుగా నిలిచాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన అల్తాఫ్​ చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. విధి నిర్వహణలో టెర్రరిస్టులను ఎదుర్కొంటూ అమరుడైన అల్తాఫ్‌కు భారత ప్రభుత్వం కీర్తి చక్ర పుస్కారాన్ని ప్రకటించింది.