జమ్మూకశ్మీర్ దేశంలో అంతర్భాగమని భారత్ పునరుద్ఘాటించింది. కశ్మీర్ అంశం పూర్తిగా ఇండియాకు సంబంధించిందని స్పష్టం చేసింది. కశ్మీర్ విషయంలో ఇండియా వైఖరిని విమర్శించిన ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో ఆపరేషన్(ఓఐసీ) రెజల్యూషన్కి ఇండియా విదేశాంగశాఖ కౌంటర్ ఇచ్చింది. మొదటి నుంచి జమ్మూకశ్మీర్ ఇండియాలో భాగమని, ఈ విషయంపై ఇండియా స్టాండ్ లో ఏ మాత్రం మార్పు ఉండదని, ఇందులో ఎవరి ప్రమేయాన్ని సహించబోమని ప్రకటించింది.
ఇదీ ఓఐసీ సదస్సు తీర్మానం
అమాయక కశ్మీరీలపై దాడులు చేస్తూ ఇండియా సైనిక దళాల అధికారాలను దుర్వినియోగం చేస్తోందని శనివారం ఓఐసీ రెజల్యూషన్‌లో పేర్కొంది. 2016 జులై నుంచి కశ్మీరీలు, మైనారిటీ కమ్యూనిటీలపై బెదిరింపులు, దాడులు జరుగుతున్నాయని, కొందరు అమాయకులు అన్యాయంగా గల్లంతవుతున్నారని ఆరోపించింది. అంతేకాకుండా తమ ఆధీనంలో ఉన్న అభినందన్‌ను భారత్ కు అప్పగించిన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను ప్రశంసిస్తూ ఓఐసీ తీర్మానం ప్రకటించింది. దీనిపై పాకిస్థాన్విదేశాంగ శాఖ హర్షం వ్యక్తం చేసింది. కశ్మీర్ అంశంపై ఓఐసీలోని 57 దేశాలు పాకిస్థాన్‌కు మద్ధతు ప్రకటించాయని సమర్థించుకుంది. భారత్ హాజరైతే ఈ సమావేశానికి తాము హాజరుకాబోమంటూ ఓఐసీ సభ్యదేశమైన పాక్ హెచ్చరించినా లెక్కచేయకుండా ఇండియాను ప్రత్యేకంగా సదస్సుకు ఇన్వైట్ చేసింది. దీంతో పాక్ మంత్రి ఖురేషి ఈ సదస్సుకు హాజరు కాలేదు.
టెర్రరిజంపై కలిసి పోరాడుదామన్న సుష్మా
అబుదాబిలో జరిగిన ఓఐసీ సమావేశానికి శుక్రవారం విశిష్ఠ అతిథిగా హాజరైన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సుమారు 17 నిమిషాల పాటు ప్రసంగించారు. ఉగ్రవాదంపై కలిసి పోరాడుదామని ఈ సందర్భంగా ఓఐసీకి పిలుపునిచ్చారు.

