
కరీంనగర్: పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి నన్ను కసబ్ అని తిడుతున్నాడు.. నేను కసబ్ కాదు.. నువ్వే అని కౌశిక్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే హుజురాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ తీసుకురావాలని సవాల్ విసిరారు. హుజురాబాద్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటుచేసిన ఆయన పైవ్యాఖ్యలు చేశారు.
‘తెలంగాణ ఉద్యమ సమయంలో కరీంగనర్ గడ్డమీదకు తుపాకి వచ్చిన నువ్వు కసబ్. ఉస్మానియా యూనివర్సిటీకి గన్ను తీసుకెళ్లి కాల్పులు చేసిన నీ పేరే కసబ్. మాణిక్ ఠాగూర్‌కు 50 కోట్లు ఇచ్చి పీసీసీ అధ్యక్ష పదవి తీసుకున్న రేవంత్ రెడ్డి.. ఇప్పుడు మళ్లీ ఈటల దగ్గర 25 కోట్లు తీసుకున్నాడు. నానక్ రామ్‌గూడలోని రామానాయుడు స్టూడియో దగ్గర ఈటల రాజేందర్‌కు ఉన్న 17 ఎకరాల భూమి సెటిల్మెంట్ చేస్తానని రేవంత్ రెడ్డి మరో 25 కోట్లు తీసుకున్నది నిజం కాదా? మాణిక్ ఠాగూర్‌కు ఇచ్చిన 50 కోట్లు.. ఈటల నుంచి వసూలు చేశాడు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడై ఉండి.. ఈటల గెలుస్తాడని స్టేట్మెంట్ ఇచ్చాడు. దేశంలో కాంగ్రెస్, బీజేపీ కలిసింది ఎక్కడా లేదు. కానీ రేవంత్ కొత్త సంప్రదాయం సృష్టించాడు. రేవంత్ రెడ్డికి, ఆయన నాయకత్వానికి ఇది మొదటి ఎగ్జాం. నీకు దమ్ముంటే హుజురాబాద్‌లో కాంగ్రెస్‌కు డిపాజిట్ తీసుకురా. కాంగ్రెస్‌కు డిపాజిట్ వస్తే.. నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. లేదంటే పీసీసీ పదవికి రాజీనామా చేయడానికి రేవంత్ రెడ్డి సిద్ధమేనా?
హుజురాబాద్‌లో పోటీ చేస్తున్న గెల్లు శ్రీనివాస్, ఈటల రాజేందర్ స్థానికులు. మరి కాంగ్రెస్ అభ్యర్థిని ఎక్కడి నుంచి తీసుకువచ్చి పెట్టారు. ఆయనది ఏ ఊరు, ఏం పేరు? అసలు హుజురాబాద్ నియోజకవర్గంలోని ఊర్ల పేరు, అవి ఎక్కడుంటాయో ఆ అభ్యర్థికి తెలుసా? నీవు అమ్ముడు పోయావని, నీవొక పెద్ద కోవర్టువని మీ పార్టీలోని సీనియర్ లీడర్లే అంటున్నారు. రేవంత్ రెడ్డి ఒక ఐరన్ లెగ్. టీడీపీ, బీజేపీలో పనిచేసి.. వాటిని ఖతం చేసి.. ఇప్పుడు కాంగ్రెస్‌ను ఖతం చేయడానికి అందులోకి వచ్చాడు. డబ్బులు వసూలు చేసే బ్రోకర్ రేవంత్ రెడ్డి. ఆర్టీఐ యాక్టును అడ్డంపెట్టుకుని బ్లాక్ మేయిల్ చేసే బ్రోకర్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఆశీస్సులతో నేను ఖచ్చితంగా కౌన్సిల్లో అడుగుపెడుతా. నీ మీద గుద్దినట్లు సమాధానం చెబుతా. టీఆర్ఎస్ పార్టీలో నేను ఎలా ఎమ్మెల్సీ అవుతానో.. ఈ పార్టీలో ఎలా ఎదుగుతానో నువ్వు చూస్తూనే ఉండు. గజ్వేల్‌లో కేసీఆర్ తలపైన కాలు పెడుతా అని రేవంత్ రెడ్డి అన్నాడు. ఇప్పుడు నేను నీ తలపై కాలుపెట్టి తొక్కి.. కౌన్సిల్లో అడుగుపెడుతా. ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్న ఈటలలో కనీసం చటాక్ అయినా ఆత్మగౌరవం ఉందా? ఆస్తులు, పదవులు కాపాడుకోవడంపై ఉన్న శ్రద్ధ.. ఈటలకు ప్రజలపై లేదు. బీజేపీలో చేరినప్పుడే మీ ఆత్మగౌరవం పోయింది. దళితుల భూములు గుంజుకోవడమేనా ఆత్మగౌరవమంటే? నీ కోవర్టు రాజకీయాలన్నీ తేలిపోయాయి. నువ్వు బీజేపీ అభ్యర్థివా? కాంగ్రెస్ అభ్యర్థివా అన్నది అర్థం కావడం లేదు. లక్షల రూపాయలతో ఈటల రాజేందర్ నాయకులను కొనుగోలు చేస్తున్నారు’ అని కౌశిక్ రెడ్డి అన్నారు.