బీఆర్ఎస్‌‌‌‌కు రూ.1400 కోట్లు క్విడ్ ప్రో కో ద్వారా వచ్చినవే : కల్వకుంట్ల కవిత

బీఆర్ఎస్‌‌‌‌కు రూ.1400 కోట్లు క్విడ్ ప్రో కో ద్వారా వచ్చినవే :  కల్వకుంట్ల కవిత
  • పార్టీ ఖాతాలో డబ్బును అమరవీరుల కుటుంబాలకు పంచాలి: కవిత
  •     కేటీఆర్, హరీశ్ అచ్చోసిన ఆంబోతులు.. సిగ్గులేని వ్యవహారాలు చేస్తున్నరు
  •     కేటీఆర్ ప్రదీప్ కన్ స్ట్రక్షన్ కు అక్రమంగా పర్మిషన్లు ఇచ్చారు
  •     బాయి బాటలో భాగంగా కొత్తగూడెంలోని పీవీకే 5 ఇంక్లైన్ మైన్‌‌‌‌లో పర్యటన

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: క్విడ్ ప్రోకో ద్వారా బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ఖాతాలో రూ.1,400 కోట్లు జమ అయ్యాయని, ఆ డబ్బును ఉద్యమకారులకు పంచాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కొత్తగూడెం జిల్లాకేంద్రంలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఇందులో భాగంగానే కేటీఆర్​ తన మిత్రుడికి చెందిన ప్రదీప్ కన్​స్ట్రక్షన్స్‌‌‌‌కు అక్రమంగా పర్మిషన్లు ఇచ్చారని, ఫినిక్స్ సంస్థకు దాదాపు రూ.80వేల కోట్ల విలువైన భూములు కట్టాబెట్టారని విమర్శించారు. 

రూ.188 కోట్లతో పయోనీర్ పేపర్‌‌‌‌‌‌‌‌ను కేటీఆర్ కొనుగోలు చేశారన్నారు. తాము అధికారంలోకి రాగానే బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్, కాంగ్రెస్ పంచిన భూములపై రివ్యూ చేస్తామని ప్రకటించారు. తాను బీఆర్ఎస్​ లోకి వెళ్తానని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కంఠంలో ప్రాణముండగా మళ్లీ బీఆర్ఎస్​లో చేరేది లేదన్నారు. తల్లి, చెల్లి అనే ఇంగితం లేకుండా బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్టు కామెంట్లు పెడ్తున్నారని ఆరోపించారు. బూతులు తిడితే ఊరుకునేది లేదని, కాళ్లు విరగొట్టి చేతిలో పెడ్తామని బీఆర్ఎస్ సోషల్​మీడియాను హెచ్చరించారు. కేటీఆర్, హరీశ్ రావు అచ్చోసిన ఆంబోతుల్లా వ్యవహరిస్తున్నారన్నారు. కాళేశ్వరం అవినీతిలో అనకొండ హరీశ్ రావునే బీఆర్ఎస్​ ఇంకా ముందు పెడ్తోందని, ఆ పార్టీ ఇక ఎన్నటికీ బాగుపడదన్నారు. 

పెద్దాయనకు అంటించిన అవినీతి మరకలు చాలవన్నట్లుగా మళ్లీ మూడు నెలలు మంత్రి పదవి కావాలంటా అని మండిపడ్డారు. తనకు టీఆర్ఎస్​అన్న పేరు రాకుండా కుట్రలు పన్నుతున్నారని, తన పార్టీతో భయం లేదంటూనే బీఆర్ఎస్​వాళ్లు ఈసీకి వెయ్యికి పైగా కంప్లైంట్​ఇచ్చారన్నారు. రైతుల సమస్యల నుంచి డైవర్ట్ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం అంశాన్ని తీసుకువచ్చిందని, సీఎంకు నీటి మీద కనీస అవగాహన లేదని, ఆఫీసర్లు చెప్పిందే మాట్లాడుతున్నారని కవిత విమర్శించారు. మేడిగడ్డతో సంబంధం లేకుండా అరకిలోమీటర్​ రాళ్లగోడ కట్టి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసుకోవచ్చన్నారు. గత ప్రభుత్వంపై కక్ష, అహంకారంతో ఈ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తొందని ఆరోపించారు.

అన్ని బొగ్గు బ్లాకులు సింగరేణికే ఇవ్వాలి 

కిషన్ రెడ్డి తెలంగాణ బిడ్డే అయితే వేలం లేకుండా గోదావరి పరివాహక ప్రాంతంలోని కోల్ బ్లాకులన్నీ సింగరేణికి కేటాయించాలని హెచ్ఎంఎస్​గౌరవ అధ్యక్షురాలైన కవిత డిమాండ్​ చేశారు. గతంలో సింగరేణికి నిజాం 17 బొగ్గు బాయిలు రాసిస్తే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లాక్కుందని, అందులో ఒక్కటి మాత్రమే సింగరేణికి ఇచ్చి కిషన్​రెడ్డి గొప్పలకు పోతున్నారన్నారు. కొత్తగూడెం ఏరియాలోని పీవీకే 5ఇంక్లైన్ మైన్‌‌‌‌ను ఆమె గురువారం సందర్శించి, కార్మికులతో కలిసి గనిలోకి దిగారు. అనంతరం గేట్ మీటింగ్‌‌‌‌లో మాట్లాడారు. ఈ నెల 20 లోపు మెడికల్​ బోర్డుపై స్పష్టమైన ప్రకటన రాకపోతే రామగుండంలో నిరవదిక దీక్ష చేపడ్తానని హెచ్చరించారు.