ప్రచారంలో పాల్గొనేందుకు బెయిల్​ ఇవ్వండి : కవిత

ప్రచారంలో పాల్గొనేందుకు బెయిల్​ ఇవ్వండి : కవిత
  •     సీబీఐ కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన కవిత
  •     ఏప్రిల్​ 20 నుంచి మే11 వరకు మినహాయింపు​ ఇవ్వాలని రిక్వెస్ట్​

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్​కేసులో బెయిల్​ కోసం బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సరికొత్త వాదనను తెరమీదకు తెచ్చారు. తాను బీఆర్ఎస్​ స్టార్​ క్యాంపెయినర్​ను అని, పార్టీ ప్రచారంలో పాల్గొనేందుకు సీబీఐ కేసులో తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని సోమవారం రౌస్ ఎవెన్యూ కోర్టును ఆశ్రయించారు. ఏప్రిల్​ 20 నుంచి మే11 వరకు మినహాయింపు​ ఇవ్వాలని కోర్టును రిక్వెస్ట్​ చేశారు. ఈ మేరకు సోమవారం సీఆర్పీసీ అండర్ సెక్షన్ 439, 437ల ప్రకారం సీబీఐ కేసులో ఫస్ట్ బెయిల్ అప్లికేషన్​ను దాఖలు చేశారు. 

కవిత తరఫున ఆమె అడ్వొకేట్​ మోహిత్ రావు మొత్తం 664 పేజీలతో కూడిన పిటిషన్ ఫైల్ చేశారు. ఇందులో కవిత అనారోగ్య సమస్యలను కూడా మెన్షన్​ చేశారు. అందుకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్ లు, మందుల వినియోగం ఇతర అంశాలను పొందుపరిచారు. అలాగే, ఈ కేసులో సహ నిందితులకు ఇచ్చినట్టుగానే తనకు బెయిల్ రిలీఫ్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. గత నెల 15 న ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేసినప్పుడు.. ఆమె హైపర్ టెన్షన్ (బీపీ) తో బాధపడుతున్నారని వివరించారు. కవిత అరెస్ట్ తర్వాత ఆమెను రాత్రి ఢిల్లీకి తరలించారని, ఈడీ కస్టడీలో రాత్రి 12:15 గంటలకు ఆమె బీపీ 186/103 గా నమోదైందని తెలిపారు. 

రాత్రి 3:35 గంటలకు వైద్యులు లాబెటాలోల్​ ఇంజెక్షన్ ఇచ్చారని.. ఆ తర్వాత బీపీ సాధారణ స్థాయికి వచ్చినట్టు పిటిషన్ లో పొందుపరిచారు. వీటిని, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని బెయిల్ ఇవ్వాలని కోరారు. అయితే, ఈ పిటిషన్ ను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఈ నెల 20 లోపు కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 22 వ తేదీ ఉదయం 10 గంటలకు చేపడతామని కోర్టు స్పష్టం చేసింది. 

కవిత బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ 

లిక్కర్ స్కామ్​లో కవిత అక్రమ అరెస్ట్, నిర్బంధించేలా సీబీఐ/ఈడీ వ్యవహరిస్తోన్న తీరును సవాల్ చేస్తూ బెయిల్ కోరుతున్నట్టు పిటిషన్ లో పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ ప్రకటించడానికి ఒక రోజు ముందు కవితను ఈడీ అరెస్టు చేసిందన్నారు. చార్జిషీట్‌‌‌‌‌‌‌‌లో కవిత పేరు లేకపోయినా సాక్షిగా విచారణ చేసిన ఈడీ ఎన్నికల ముందు విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోందని ఆరోపించారు. తాజాగా, బీఆర్ఎస్ పార్టీ కవితను స్టార్ క్యాంపెయినర్ గా ప్రకటించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇదంతా జరుగుతోందన్నారు. 

మరో 10 రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా సీబీఐ కూడా సీన్ లోకి వచ్చి అరెస్టు చేసిందని తెలిపారు. ఈడీ అడిగిందే సీబీఐ కూడా అడుగుతోందని, ఒక ప్రశ్నకు ఒకే సమాధానం ఉంటుందని పేర్కొన్నారు. సమాధానం తెలియని విషయాల గురించి ఎవరైనా తెలియదనే చెబుతారని, దీన్ని కూడా ఈడీ/సీబీఐలు తప్పు చేస్తున్నట్టుగా చెబుతున్నాయని తెలిపారు. దర్యాప్తునకు సహకరించడం లేదంటూ తప్పుడు అభియోగాలు చేస్తున్నాయని అన్నారు. ఈ నెపంతో నిరంతరం తనను జైల్లోనే ఉంచే విధంగా ఈడీ/సీబీఐలు కుట్ర చేస్తున్నాయని కవిత పిటిషన్​లో ఆరోపించారు. నిరంతరం జైల్లో ఉండేలా చేయడమంటే ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనని, వాస్తవానికి ఈడీ లేదా సీబీఐల వద్ద ఆధారాలు లేవని చెప్పారు. అప్రూవర్స్‌‌‌‌‌‌‌‌ చెప్పిన సమాచారం ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తోంది అని బెయిల్‌‌‌‌‌‌‌‌ పిటిషన్‌‌‌‌‌‌‌‌లో కవిత పేర్కొన్నారు. 

పిటిషన్​లో ఎంపీ బండి సంజయ్ కామెంట్స్ కోట్​

664 పేజీల పిటిషన్ కాపీలో కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్ కామెంట్స్ ను కవిత కోట్​ చేశారు. లిక్కర్ స్కాం దర్యాప్తు తొలి దశలో ఉన్న టైంలో.. 2022 డిసెంబర్ 4 న కవిత అరెస్ట్ తప్పదని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను మెన్షన్ చేశారు. ఈ వార్తను చూసి తాను షాక్ అయ్యానని.. దీన్ని పరిశీలిస్తే, కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగడం లేదని తెలుస్తోందన్నారు.