​​​​​​​ఢిల్లీ లిక్కర్​ స్కామ్​లో నిందితురాలిగా కవిత?

​​​​​​​ఢిల్లీ లిక్కర్​ స్కామ్​లో నిందితురాలిగా కవిత?
  • ఇన్నాళ్లూ సాక్షిగానే విచారణకు పిలిచిన సీబీఐ
  • తాజా సమన్లలో మాత్రం నిందితురాలిగా ప్రస్తావన!
  • ఎల్లుండి విచారణ.. హాజరుకావాలని నోటీసులు
  • ఇప్పటివరకు స్పందించని కవిత, బీఆర్​ఎస్​ వర్గాలు

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్​లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఈ నెల 21న సీబీఐ నుంచి ఆమెకు సమన్లు అందిన విషయం తెలిసిందే. ఈ నెల 26న తమ ముందు హాజరుకావాలని అందులో కవితకు సీబీఐ స్పష్టం చేసింది. అయితే ఈ నోటీసుల్లో కవితను నిందితురాలి కింద పేర్కొన్నట్లు సమాచారం. 


నిందితులను విచారణకు పిలిచే సీఆర్పీసీ సెక్షన్ 41 (ఏ) కింద కవితను విచారణకు హాజరుకావాలని ఆదేశాల్లో స్పష్టం చేసినట్లు తెలిసింది. వాస్తవానికి ఇప్పటి వరకు రెండు సార్లు కవితకు సీబీఐ నుంచి నోటీసులు అందాయి. 2022  డిసెంబర్ 11న సీఆర్పీసీ 160 కింద సాక్షిగా మాత్రమే కవితను ఆమె ఇంట్లో సీబీఐ సుదీర్ఘంగా విచారించింది. అనంతరం మరోసారి జారీ చేసిన నోటీసుల్లోనూ సీఆర్పీసీ 90 కింద తన దగ్గర ఉన్న సమాచారాన్ని అందించాలని కోరింది. అయితే.. ఈసారి కవితను సెక్షన్ 41 (ఏ) కింద నిందితురాలిగా విచారణకు పిలిచినట్లు ఢిల్లీ సర్కిల్స్​లో చర్చ జరుగుతున్నది. 

 విచారణకు హాజరు కాకపోతే అరెస్ట్!

లిక్కర్ స్కామ్​లో తొలిసారి(2022 డిసెంబర్​ 11న) సీబీఐ నుంచి నోటీసులు అందుకున్నప్పుడు కవిత లీగల్ ఓపినియన్ తో సమయం కోరారు. ఇందుకు సీబీఐ కూడా అంగీకరించింది. సాక్షిగా విచారణకు పిలిచిన నేపథ్యంలో.. వెసులుబాటు కల్పిస్తూ, ఆమె ఇంటికి వెళ్లి మరీ సీబీఐ అధికారులు స్టేట్​మెంట్​ను రికార్డ్ చేశారు. ఇదే కేసులో ఎన్ ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ కింద కవితను విచారించారు. ఈ దిశలో ఢిల్లీలోని తమ కార్యాలయానికి రావాలని స్పష్టంగా ఆదేశాల్లో పేర్కొని, ఈడీ హెడ్ ఆఫీసులోనే కవిత వాంగ్మూలాన్ని నమోదు చేశారు.

అయితే.. కవితను ఇప్పుడు సాక్షిగా కాకుండా... నిందితురాలిగా సీబీఐ విచారించే అవకాశం ఉందని ఢిల్లీలో ప్రచారం జరుగుతున్నది. వాస్తవానికి కేసులో అనుమానితులుగా, నిందితులుగా భావిస్తున్న వారికే 41, 41(ఏ), 41(ఏ,బీ) కింద నోటీసులు జారీ చేస్తారు. ఇటీవల సీబీఐ సేకరించిన తాజా ఆధారాలతోనే కవితను నిందితురాలిగా పరిగణిస్తూ 41(ఏ) కింద సమన్లు ఇచ్చినట్లు తెలిసింది.

ఈ సెక్షన్ కింద సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థల నుంచి నోటీసులు అందుకున్న వ్యక్తి విధిగా విచారణకు కావాల్సి ఉంటుందని న్యాయనిపుణులు చెప్తున్నారు. లేకపోతే సదరు వ్యక్తిని అరెస్ట్ చేసే అధికారం సీబీఐకి ఉంటుందని అంటున్నారు. నిందితురాలిగా కవిత పేరును సీబీఐ చేర్చిందని జరుగుతున్న ప్రచారంపై కవిత గానీ, బీఆర్​ఎస్​ వర్గాలు కానీ స్పందించలేదు.