సిద్దిపేట/తొగుట, వెలుగు: యువత, మహిళలు రాజకీయాల్లోకి రావాలని, తెలంగాణ రక్షణే ధ్యేయంగా తెలంగాణ రక్షణ సేన పనిచేస్తుందని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని క్యాసారంలో నిర్వహిస్తున్న శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కల్యాణ మహోత్సవం, జగదేవ్‌పూర్ మండలం పలుగుగడ్డ లోని పెద్దమ్మ దేవాలయం, మిరుదొడ్డి మండలం మోతె రామాలయాలను సందర్శించి మాట్లాడారు.
రాష్ట్ర ప్రజలను అన్ని అంశాల్లో రక్షించేందుకు తెలంగాణ రక్షణ సేన అనే పార్టీ పెట్టామని వివరించారు. ప్రజలకు ఉచితంగా వైద్యం, విద్య అందేందుకు టీఆర్ఎస్ కృషి చేస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆలయాల్లో కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీలో ముదిరాజ్‌లకు సముచిత స్థానం ఉంటుందని రేణుక తల్లి దయతో తెలంగాణ ప్రజలు సంతోషంగా జీవించాలని మీ అందరి దీవెనలు పార్టీకి ఎప్పటికీ ఉండాలని కోరారు.
