
హైదరాబాద్, వెలుగు: లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 22 వరకు రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. గురువారం వీడియో కాన్ఫరెన్స్ లో కవితను రౌస్ అవెన్యూ కోర్టు ముందు అధికారులు హాజరుపరిచారు. తనకు ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలను, మెడికల్ టెస్టుల ఫలితాల్లో వ్యత్యాసాలను న్యాయమూర్తి దృష్టికి కవిత తీసుకెళ్లగా, మెడికల్ చెకప్‌కు కోర్టు అనుమతి ఇచ్చింది.
ఢిల్లీలోని ఎయిమ్స్ లో కవితకు మెడికల్ పరీక్షలు నిర్వహించాలని తీహార్ జైలు అధికారులకు ట్రయల్ కోర్టు ఆదేశించింది. టెస్టుల తర్వాత రిపోర్టును అందించాలని జడ్జి కావేరి భవేజా ఆదేశించారు. ఇటీవల అస్వస్థత కారణంగా దీన్ దయాళ్ ఆసుపత్రిలో కవితకు పరీక్షలు నిర్వహించి తిరిగి జైలుకు అధికారులు తరలించారు. విచారణ సందర్భంగా ప్రైవేటు ఆస్పత్రిలో చెకప్ కోసం దరఖాస్తు చేసిన కవిత తరఫున న్యాయవాదులు అప్లికేషన్ పెట్టుకున్నారు.