- బాధితుల పక్షాన నిలబడిన నేతలను అరెస్టు చేస్తున్నరు
- అందుకే మేధావులతో నిజనిర్ధారణ కమిటీ వేస్తున్నం
- కమిటీకి ప్రభుత్వం, అధికారులు సహకరించాలని విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: వెలుగుమట్ల బాధితుల పక్షాన పోరాటం ఆగదని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, మాజీ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ఎక్కడైతే పేదల ఇండ్లు కూల్చివేశారో అక్కడే 300 మందికి పైగా బాధితులకు ప్రభుత్వమే ఇండ్ల స్థలాలు కేటాయించడం ప్రజల విజయమని అన్నారు. వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయడం కోసం మేధావులతో నిజ నిర్ధారణ కమిటీ వేసినట్లు కవిత వెల్లడించారు.
ఈ మేరకు మంగళవారం హైదరాబాద్సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో డీఎస్పీ వ్యవస్థాపకులు డాక్టర్ విశారదన్, హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ బి.చంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. బాధితుల పక్షాన నిలబడిన నేతలను ప్రభుత్వం అరెస్ట్ చేసి జైళ్లలో పెడుతున్నదన్నారు. అందుకే మేధావులతో నిజనిర్ధారణ కమిటీ వేసినట్లు చెప్పారు.
ఈ కమిటీ బుధవారం వెలుగుమట్లకు వెళ్లి ఇండ్లు కూల్చిన స్థలాలను పరిశీలిస్తుందని, బాధితులతో మాట్లాడి వారి అవసరాలు తెలుసుకుంటుందని చెప్పారు. ఈ కమిటీ పర్యటనకు ప్రభుత్వం సహకరించాలని కోరారు. ‘వెలుగుమట్లలో 750కి పైగా ఇండ్లు కూల్చివేస్తే బాధిత కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి. ఇందులో 300 మందికి అక్కడే 75 గజాల చొప్పున స్థలం కేటాయించి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
మరో 111 మందికి వారి సొంత గ్రామాల్లో స్థలాలిచ్చి ఇండ్లు కట్టిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇంతవరకు బాగానే ఉన్నా మిగిలిన 350కి పైగా ఉన్న కుటుంబాల పరిస్థితి ఏంటి?’ అని కవిత ప్రశ్నించారు. రిటైర్డ్ హైకోర్టు జడ్జి, ప్రొఫెసర్లు, లాయర్లు, సామాజిక వేత్తలు, జర్నలిస్టులతో కూడిన ఈ కమిటీ బాధితులందరికీ న్యాయం జరిగేలా చూస్తుందన్నారు. ప్రొఫెసర్ కోదండరాం, హరగోపాల్, ఆకునూరి మురళి లాంటి మేధావులు కూడా ఈ విషయంపై స్పందించి పేదల పక్షాన ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వాలని కవిత కోరారు.
ఏడు పోలీస్స్టేషన్లు తిప్పారు: డాక్టర్ విశారదన్
వెలుగుమట్ల బాధితుల్లో కొందరికే న్యాయం జరిగిందని ధర్మ సమాజ్‌పార్టీ (డీఎస్పీ) వ్యవస్థాపకుడు డాక్టర్ విశారదన్ అన్నారు. మిగతా బాధితుల పక్షాన పోరాటం చేయడానికి తాము ఖమ్మం వెళితే.. పోలీసులు అరెస్ట్ చేసి ఏడు పోలీస్ స్టేషన్లు తిప్పారని పేర్కొన్నారు. వెలుగుమట్లలో ఇండ్లు కూల్చి వారి సొంత గ్రామాల్లో ఇండ్ల స్థలాలిస్తామని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. బాధిత కుటుంబాలకు వెలుగుమట్లలోనే 100 గజాల స్థలం ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి నిధులివ్వాలని డిమాండ్ చేశారు.
నేషనల్ మీడియాకు కనిపించలేదు: రిటైర్డ్ మేజర్ మదన్ మోహన్
వెలుగుమట్లలో 750 ఇండ్లు కూల్చివేసి సుమారు 2 వేల మందిని నిరాశ్రయులుగా మార్చిన విషయం నేషనల్ మీడియాలో పెద్దగా కనిపించలేదని రిటైర్డ్ మేజర్ మదన్ మోహన్ అన్నారు. చెన్నైలో ఉన్న తనకు వెలుగుమట్ల బాధితుల విషయం సోమవారమే తెలిసిందని, వారి పక్షాన పోరాటం చేయడానికి సిద్ధమని అన్నారు.
నిజనిర్ధారణ కమిటీలో ఉన్నది వీరే
నిజనిర్ధారణ కమిటీ చైర్మన్‌గా రిటైర్డ్ హైకోర్టు జడ్జి జస్టిస్ చంద్ర కుమార్ వ్యవహరిస్తారు. కమిటీ సభ్యులుగా ఆర్మీ మాజీ మేజర్ మదన్ మోహన్, ప్రొఫెసర్లు అనురాధ, నాగం కుమార స్వామి, రామయ్యతోపాటు హైకోర్టు లాయర్లు సుంకర నరేష్, శ్రావణ్ గౌడ్, నూర్జన్, సీనియర్ జర్నలిస్టులు తెలంగాణ విఠల్, ఆకాశ్ గౌడ్, క్రాంతి ఉన్నారు.
ఇండ్లు కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది: చంద్రకుమార్
ప్రభుత్వ స్థలాల్లో కట్టుకున్న ఇండ్లను కూల్చివేయాల్సినంత అవసరం ఏమొచ్చిందని ప్రభుత్వ అధికారులను రిటైర్డ్ హైకోర్టు జడ్జి జస్టిస్ చంద్రకుమార్ ప్రశ్నించారు. వాళ్లేమైనా శత్రు దేశానికి చెందిన వాళ్లా? అని ప్రశ్నించారు. ‘ప్రభుత్వంలో ఉన్నవాళ్లు, పాలకులు వాళ్లకు నచ్చింది చెబుతారు.. అవేమీ రికార్డుల్లో ఉండవు. వాస్తవాలు తెలుసుకోకుండా చట్టవ్యతిరేకమైన పనులు చేస్తే ఆఫీసర్లే ఇరుక్కుంటారు.
ఈ విషయాన్ని ప్రతి అధికారి గుర్తించి పనిచేయాలి’ అని సూచించారు. పొరుగుదేశాల్లో యువత పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసి మేధావుల సహకారంతో పోరాటాలు చేస్తే అక్కడి ప్రభుత్వాలే మారాయని అన్నారు. నిజనిర్ధారణ కమిటీ ప్రభుత్వానికి, అధికారులకు సూచనలు, సలహాలు మాత్రమే ఇస్తుందన్నారు.
