- కడిగిన ముత్యంలా బయటకొచ్చిన
- లిక్కర్ స్కామ్ ఓ తప్పుడు కేసు : కవిత
- బీఆర్‌ఎస్ ఓటమికి ఈ కేసే కారణమంటూ కేటీఆర్ ట్విస్ట్ ఇస్తున్నరు.. పార్టీ తప్పులు, ఆ పార్టీ పెద్దల
- అహంకారంతోనే కదా ఓడిపోయింది!
- కేసును నా మెడకు ఎందుకు వేయాలని చూస్తున్నరు?
- నేను జైలులో ఉన్నప్పుడు కేసీఆర్, కేటీఆర్
- ఒక్కసారైనా మీడియాతో మాట్లాడారా? అని కామెంట్
హైదరాబాద్, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఓ తప్పుడు కేసు అని తాను ముందు నుంచీ చెబుతున్నానని, ఇప్పుడు కోర్టు కూడా అదే చెప్పిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. అన్నట్లే తాను కడిగిన ముత్యంలా బయటకు వచ్చానని వ్యాఖ్యానించారు. కేసులో వాదనలే తప్పు అని కోర్టు వ్యాఖ్యానించిందని గుర్తుచేశారు. కేటీఆర్ ఓ వైపు కంగ్రాట్స్ చెబుతూనే.. బీఆర్‌ఎస్ ఓటమికి లిక్కర్ స్కామ్ కేసే కారణమనేలా ట్వీట్చేశారని, బీఆర్ఎస్ సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ చేస్తూ పార్టీ ఓటమికి కేసే కారణమనేలా ట్విస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘బీఆర్ఎస్ పెద్దల అహంకారం, మీరు చేసిన తప్పిదాల వల్లే కదా పార్టీ ఓడిపోయింది” అని కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీపై కక్ష సాధింపు కోసమే తనపై కేసు పెట్టలేదా? అని కేటీఆర్‌ను ఆమె ప్రశ్నించారు. తాను జైలుకు వెళ్లాక కేసీఆర్, కేటీఆర్‌లాంటి పెద్ద నాయకులెవరూ ఎందుకు ప్రెస్‌మీట్ పెట్టలేదని నిలదీశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో క్లీన్చిట్ రావడంతో శుక్రవారం బీఆర్‌కే భవన్ వద్ద కవిత మీడియాతో మాట్లాడారు. కేసును తాను ఒంటరిగా ఎదుర్కోవాల్సి వచ్చిందని, కనీసం సోషల్ మీడియా సపోర్ట్ కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడైనా తనకు సపోర్ట్ చేశారా? అని ప్రశ్నించారు. ‘‘అత్యంత పవిత్రంగా తొమ్మిది రోజులు అన్నం తినకుండా బతుకమ్మ ఎత్తుకొని జాతి సంస్కృతిని తెలిపిన బిడ్డను నేను. అలాంటిది బతుకమ్మ ప్లేస్‌లో లిక్కర్ బాటిల్
ఎత్తుకున్నట్టు బీజేపీ సోషల్ మీడియా నన్ను అవమానిస్తుంటే బీఆర్‌ఎస్ సోషల్ మీడియా ఏమైంది? ఆనాడే అలాంటి తప్పుడు ప్రచారాలను ఎదుర్కొంటే బీఆర్ఎస్కు ఈ గతి పట్టేదా? అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓడిపోవటానికి నేను కారణమా? ప్రజలు ఒకసారి ఆలోచించాలి. నేను తప్పు చేయలేదని ఆనాడే ధైర్యంగా చెప్పాను. ఉద్యోగాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వకపోవడం.. దోపిడీదార్లకు టికెట్లు ఇవ్వడం, ప్రవళిక ఆత్మహత్యలాంటి అంశాలే అప్పుడు చర్చలో ఉన్నాయి. కానీ, ఇప్పుడు కోర్టు తీర్పును మీకు అనుకూలంగా మలుచుకొని పార్టీ ఓటమిని నా మెడలో వేయాలని చూస్తున్నారు. లిక్కర్ కేసు వల్లే ఓడిపోయినట్టు సోషల్ మీడియాలో అడ్డమైన రాతలు రాస్తున్నారు. ఈ కేసులో ఏం జరిగిందో నిజంగా కేటీఆర్‌కు తెలియదా? ఆయన వాస్తవాలు గ్రహించాలి. తప్పులు ఎక్కడ జరిగాయో ఇప్పటికైనా సమీక్షించుకోవాలి. కేటీఆర్ నిజాలను అంగీకరించి ప్రజలకు జవాబుదారీగా ఉంటే మంచిది. పార్టీ ఓటమిని నా మెడకు వేయాలని చూస్తే ప్రజలు హర్షించరు. నిజాలు చెప్పండి’’ అంటూ కేటీఆర్‌కు ఆమె హిత వు పలికారు.
కుమ్మెర ఘటనలో నిందితులను రక్షిస్తున్నరు..
కుమ్మెరలో 2 నెలల చిన్నారి మరణానికి కారణమైన వారికి శిక్షపడేలా చూడాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కవిత డిమాండ్ చేశారు. చిన్నారి మరణంపై పోలీసులు ఒక్క సెక్షన్ కూడా పెట్టలేదన్నారు. శుక్రవారం చిన్నారి తల్లిదండ్రులు మౌనిక, గణేష్‌తో కలిసి డీజీపీ ఆఫీసుకు వచ్చిన ఆమె.. అక్కడ మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో ఎన్నో కోణాలున్నా పోలీసులు ఏ సెక్షన్ కింద కూడా కేసు పెట్టలేదని తెలిపారు. పోలీసులు, ప్రభుత్వం కలిసి నేరం చేసిన వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తున్నదని పేర్కొన్నారు. 2026లో కుల వివక్షతో ఇంతటి దాష్టీకం జరగడం చూస్తుంటే ప్రజా పోరాటాలతో సంబంధం ఉన్న వ్యక్తిగా చాలా సిగ్గు పడుతున్నానన్నారు. కుల వివక్ష ఉండకుండా పరిస్థితి మారేందుకు ఈ కేసులో కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితులను శిక్షించేదాకా తమ పోరాటం ఆగబోదని చెప్పారు.
తీర్పు రాగానే అమ్మతో మాట్లాడిన..
లిక్కర్ పాలసీ కేసులో తనను ఐదున్నర నెలలు జైలులో పెట్టి క్షోభకు గురి చేశారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. దీంట్లో ఇంకా ఈడీ కేసు ఉందని బీజేపీ వాళ్లు అంటున్నారన్నారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు అధికారిపై విచారణ చేయాలని జడ్జి చెప్పారని పేర్కొన్నారు. కేసుకు సంబంధించి తన తల్లి తీవ్ర ఆవేదనతో ఉందని.. దీంతో తీర్పు రాగానే అమ్మతో మాట్లాడానని చెప్పారు. శుక్రవారం ఆమె మీడియాతో చిట్‌చాట్‌లోనూ పలు అంశాలను పంచుకున్నారు. తనకు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఎవరూ తెలియదన్నారు. ఎంపీగా ఉన్నప్పుడు ఒక్క సంజయ్ సింగ్ పరిచయం అయ్యారని చెప్పారు. తాను తన దగ్గర ఉన్న ఫోన్లన్నీ ఈడీకి ఇచ్చేశానని, ఆధారాలుంటే చూసుకోమని చెప్పానని తెలిపారు. మావోయిస్టు ఉద్యమంలో పనిచేసిన అగ్రనేతలకు తన కంటే లక్ష రెట్లు సమాజం పట్ల అవగాహన ఉందన్నారు. తాను బయట ఉండి పోరాటం చేస్తే వారు అడవుల్లో ఉండి సమాజం కోసం పోరాటం చేశారన్నారు. అజ్ఞాతంలో ఉండి సమాజం కోసం పోరాటం చేసిన వారు అదే సిద్ధాంతంతో ప్రజా జీవితంలోకి రావడం మంచి పరిణామమని తెలిపారు. మాజీ మావోయిస్టులకు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు తమ హామీలను నిలబెట్టుకోలేదని.. అలాంటి వాటి సాధన కోసం, వారి సిద్ధాంతాల కోసం పోరాటం చేస్తానని తెలిపారు. తాను పార్టీ పెట్టిన తర్వాత చాలా ఆశ్చర్యకర పరిణామాలు ఉంటాయన్నారు.
బీఆర్ఎస్ ఓటమికి నేనెట్ల కారణం?
నిజామాబాద్‌లో తాను ఓడిపోయినప్పుడు కారణాలు వెతుక్కోలేదని, ప్రజల తీర్పును అంగీకరించానని కవిత చెప్పారు. ఢిల్లీ ఎన్నికలు కేజ్రీవాల్అరెస్ట్ తర్వాత జరిగాయని, తెలంగాణలో మాత్రం అసెంబ్లీ ఎన్నికలయ్యాక తనను అరెస్ట్ చేశారని ఆమె గుర్తుచేశారు. లిక్కర్ కేసుతోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారనడం అబద్ధమని, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఆర్మీ ద్వారా తప్పుడు రాతలు రాయిస్తున్నారని మండిపడ్డారు. తనకు వాళ్లలాగా ఏ ఆర్మీ లేదని, తనకున్న పిడికెడు మందితోనే తాను ప్రజల పక్షాన పోరాటం చేస్తానని చెప్పారు. ‘‘ఒక ఆడబిడ్డ కష్టంలో ఉన్నప్పుడు అడ్డమైన టైటిల్స్ పెట్టిన అడ్డగాడిదలకు ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెప్పాలి. బీజేపీ వాళ్లు మాట్లాడిందే.. బీఆర్ఎస్ వాళ్లు కూడా మాట్లాడుతున్నారంటే వాళ్లంతా ఒక్కటే. బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయిందో నీతిగా నిజాయతీగా ఆలోచించండి. ఓటమిని నా మెడలో వేసేందుకు ఎందుకంత తాపత్రయం? బీఆర్ఎస్ అంత బలహీనంగా ఉందా? ఓ వ్యక్తి తప్పు చేస్తే ఓడిపోయే స్థితిలో ఉన్నారా?’’ అని ఆమె ప్రశ్నించారు. ఈ తప్పుడు కేసు వల్ల తాను ఐదు నెలలు పిల్లలు, కుటుంబానికి దూరంగా ఉండాల్సివచ్చిందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో బాధ, ఎన్నో అవమానాలు, క్యారెక్టర్ అసాసినేషన్‌ను ఎదుర్కొన్నానని చెప్పారు. ఎన్ని కోట్లు ఇచ్చినా సరే ఆ అవమానం తీరేది కాదని, పోయిన సమయం తిరిగి రాదని పేర్కొన్నారు. తన కుటుం బానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. కేసులో ప్రతి వాయిదాకూ జాగృతి కార్యకర్తలు వచ్చి నైతి క స్థైర్యం ఇచ్చారని గుర్తుచేశారు. ‘‘మా అమ్మా నాన్నలు, అత్తామామలు, భర్త అండగా నిలిచారు.. ఆ బలంతోనే కన్నీళ్లు దిగమింగి కర్తవ్యాన్ని గుర్తుచేసుకుంటూ ముందుకు కదిలా. పార్టీ పెట్టాలనుకున్న సమయంలో ఈ తీర్పు రావడమంటే ప్రకృతి, దేవుడు సహకరించి ఆశీర్వాదం ఇస్తున్నట్టే” అని పేర్కొన్నారు. ప్రజాసేవ చేసేందుకు తనకు ఈ కేసులు ఏ మాత్రం అడ్డంకావని చెప్పారు. రెండు నెలల్లో పార్టీ పెట్టబోతున్నానని స్పష్టం చేశారు.
