ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటన రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెంచుతోంది. మంగళవారం ( జూన్ 2 ) తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. తెలంగాణ నవ నిర్మాణ సభ పేరుతో టీజీ జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహిస్తున్న క్రమంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఈ క్రమంలో టీఆర్ఎస్ చీఫ్ కవిత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ముందు మీ సెక్రటేరియట్ లోకి నీళ్లు రాకుండా చూసుకోండి.. ఆ తర్వాత తెలంగాణ నవ నిర్మాణ సభ పెట్టుకోండని అన్నారు కవిత.
టీఆర్ఎస్ 2.0తో పెట్టుకుంటే మూతి పళ్లు రాలుతాయని..ఒకసారి పెట్టుకుంటే తెలంగాణ తెచ్చుకున్నామని..మళ్లీ మా జోలికొస్తే మూతి పళ్లు రాలుతాయని అన్నారు కవిత. ఆంధ్రాలో రాజధాని కట్టడం చేతకాకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు కవిత. తెలంగాణలో ఏపీ ఏజెంట్ సీఎంగా ఉండటంతో డ్రామాలు చేస్తున్నారని అన్నారు.
ఇదిలా ఉండగా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పవన్ కళ్యాణ్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన తర్వాతే ఇక్కడ నవ నిర్మాణ సభ పెట్టుకోవాలని డిమాండ్ చేశారు. అనువణువునా తెలంగాణపై వ్యతిరేకతను నింపుకున్న పవన్... ఇప్పుడు తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా బీజేపీ ఎజెండాను మోస్తున్నారని మండిపడ్డారు.
