రాజకీయ కక్షతోనే కేసీఆర్​కు నోటీసులు..అది కాళేశ్వరం కమిషన్​ కాదు.. కాంగ్రెస్​ కమిషన్: ఎమ్మెల్సీ కవిత

రాజకీయ కక్షతోనే కేసీఆర్​కు నోటీసులు..అది కాళేశ్వరం కమిషన్​ కాదు.. కాంగ్రెస్​ కమిషన్: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్, వెలుగు: రాజకీయ కక్షతోనే మాజీ సీఎం కేసీఆర్ కు​కాళేశ్వరం కమిషన్​ పేరుతో నోటీసులు ఇచ్చారని బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. అది కాళేశ్వరం కమిషన్​ కాదని, కాంగ్రెస్​ కమిషన్​అని ఆమె విమర్శించారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా తీర్చిదిద్దేందుకు కేసీఆర్​కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని, ఆ ప్రాజెక్టుపై కాంగ్రెస్​ వాళ్లకు మొదటి నుంచీ కడుపుమంటగానే ఉందని మంగళవారం ఓ ప్రకటనలో మండిపడ్డారు.

పేద ప్రజలు బాగుపడడం కాంగ్రెస్​ పార్టీకి ఎప్పుడూ ఇష్టం ఉండదని, ప్రజలు పేదరికంలో ఉంటేనే తమకు పదవులు వస్తాయని భావించే నాయకత్వం కాంగ్రెస్​ పార్టీదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మొదటి నుంచీ కాంగ్రెస్​ నేతలు కుట్రలు పన్నుతున్నారని, ఎన్నో కేసులు వేశారని మండిపడ్డారు. రాజకీయ కుట్ర, కక్షతో వేసిన ఇలాంటి కమీషన్లు కాలక్రమంలో తప్పకుండా న్యాయాన్నే గెలిపిస్తాయని చెప్పారు. పాలేవో, నీళ్లేవో త్వరలోనే తెలుస్తాయని కవిత పేర్కొన్నారు.