- ప్రభుత్వం సింగరేణి, ఆర్టీసీ సహా కార్మికులందరినీ మోసం చేస్తోంది: టీఆర్ఎస్ చీఫ్ కవిత
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అన్ని వర్గాల జీవితాలను మార్చే అభివృద్ధి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. తమ పార్టీ కచ్చితంగా తెలంగాణ ప్రజల ఇంటి పార్టీగా మారుతుందని తెలిపారు. ప్రశ్నించడం, పోరాటడటం, పరిష్కరించడం అనే విధానంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి బోడ జనార్దన్ గురువారం తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్లో చేరారు.
హైదరాబాద్లోని బంజారాహిల్స్లో గల పార్టీ ఆఫీస్లో కవిత వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. సింగరేణి, ఆర్టీసీ సహా అన్ని రంగాల కార్మికులను ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. సీఎం రేవంత్రెడ్డి మల్కాజిగిరి ఎంపీగా ఉన్న సమయంలో కార్మికులకు కనీస వేతనం రూ.20 వేలు ఉండాలని అప్పటి సీఎంకు లేఖ రాశారని గుర్తు చేశారు. కానీ, ముఖ్యమంత్రి అయ్యాక కేవలం రూ.16 వేల వేతనం ఫిక్స్ చేశారన్నారు.
సింగరేణిలో అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి, రెండున్నరేండ్లుగా పట్టించుకోవడం లేదన్నారు. పెట్రోల్ ధరలపై ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నాయకులను ముందు వడ్లు కొనాలని సూచించినందుకు ఓ ఆర్టీసీ డ్రైవర్ ఉద్యోగం తీసేశారన్నారు. అప్పట్లో ఎన్టీఆర్ కూడు, గూడు, గుడ్డ నినాదంతో అధికారంలోకి వచ్చారని, తర్వాత కేసీఆర్ నీళ్లు, నిధులు, నియామకాలు పేరుతో అధికారం చేపట్టారని మాజీ మంత్రి బోడ జనార్దన్అన్నారు. కవిత మాత్రం పాంచజన్యం అంటూ 5 కీలకమైన అంశాలతో ఆ ఇద్దరు నాయకుల కన్నా ఉన్నతంగా ఆలోచించారని కొనియాడారు. ఆమె ప్రకటించిన మేనిఫెస్టో నచ్చి టీఆర్ఎస్ లో చేరినట్లు పేర్కొన్నారు.
