క్రెడిట్ పాయింట్స్ పేరిట నర్సులను వేధించొద్దు : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

క్రెడిట్ పాయింట్స్ పేరిట నర్సులను వేధించొద్దు : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
  • రూల్స్​పై ప్రభుత్వం అవగాహన కల్పించలేదు: కవిత

హైదరాబాద్, వెలుగు: నర్సింగ్​ సిబ్బందిని క్రెడిట్​పాయింట్ల పేరుతో వేధించొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్​చేశారు. క్వాలిఫైడ్ నర్సుల రిజిస్ట్రేషన్ రెన్యూవల్ కోసం ఐదేండ్లలో 150 క్రెడిట్ పాయింట్లు సాధించి ఉండాలనే రూల్ సరికాదని బుధవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఇండియన్​ నర్సింగ్​ కౌన్సిల్​తెచ్చిన ఈ నిబంధనలపై తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ కనీస అవగాహన కల్పించే ప్రయత్నాలు చేయలేదని గుర్తుచేశారు. తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలోని 80 వేల మంది నర్సింగ్ సిబ్బంది తమ రిజిస్ట్రేషన్ల రెన్యూవల్​కు ఇబ్బంది పడుతున్నారని వివరించారు. 

నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడానికి క్రెడిట్ అవర్స్ కలిగి ఉండాలనే నిబంధన తెచ్చినట్టు కూడా చాలా మంది నర్సులకు తెలియదన్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా ప్రజల ప్రాణాల రక్షణకు సేవలందించే నర్సింగ్ సిబ్బంది రెన్యూవల్ విషయంలో కఠిన నిబంధనలు సరికాదన్నారు. ఉద్యోగాలు చేస్తూ నర్సింగ్ సిబ్బంది నెలకు కనీసం రెండు కాన్ఫరెన్స్ లకు హాజరయితే తప్ప నర్సింగ్ కౌన్సిల్ నిబంధనల మేరకు క్రెడిట్ పాయింట్స్ సాధించడం సాధ్యం కాదని చెప్పారు.