- సీఎం, మంత్రి వెంటనే హాస్టళ్లలో సమస్యలను పరిష్కరించాలి: కవిత
ఓల్డ్‌సిటీ/మెహిదీపట్నం, వెలుగు: చలిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు దుప్పట్లు, కనీస సదుపాయాలు కల్పించలేని ప్రభుత్వం.. జల్సాలకు రూ.వందల కోట్లు ఖర్చు చేయడం దురదృష్టకరమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆవేదన వ్యక్తం చేశారు. జాగృతి ‘జనం బాట’లో భాగంగా శనివారం హైదరాబాద్ చాంద్రాయణగుట్టలోని రాజన్నబావి బీసీ హాస్టల్‌ను ఆమె సందర్శించారు.
11 గదుల్లో 170 మంది విద్యార్థులు నేలపై నిద్రిస్తున్నారని, దుప్పట్లు, పుస్తకాలు కూడా లేవని, లైబ్రరీలో ఖాళీ రాక్‌లు మాత్రమే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం, బీసీ సంక్షేమ మంత్రి వెంటనే ఈ హాస్టల్ ను సందర్శించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు. బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్, జూనియర్ కాలేజీ ఉన్న ప్రాంతంలో వైన్‌షాపుకు ఎలా పర్మిషన్ ఇచ్చారని ఆమె ప్రశ్నించారు.
ఛత్రినాక్ శివాలయం వీధిలో వర్ష బాధితులను ఆమె పరామర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి అమీర్ పేటనే కాకుండా పాత బస్తీని కూడా సందర్శించాలని కోరారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో ఏ ఒక్కటీ సర్కారు నెరవేర్చలేదని కవిత ఆరోపించారు.
బాపూ ఘాట్‌ను అభివృద్ధి చేయాలి..
కార్వాన్ నియోజకవర్గం పరిధిలోని లంగర్ హౌస్ బాపూ ఘాట్, దర్గా, జియాగూడ కబేలాలో కవిత పర్యటించారు. లంగర్ హౌస్ మూసీ నది పరీవాహక ప్రాంతమైన సంఘం బాపూ ఘాట్ పరిశుభ్రంగా లేదని, గంజాయి అడ్డాగా మారిందని ఆరోపించారు. టూరిజం కోసం అభివృద్ధి పరుస్తామని తెలిపిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేపట్టలేదని అన్నారు.
బాపు ఘాట్ లో 55 కోట్ల వ్యయంతో టూరిజం అభివృద్ధితో పాటు గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతంలో ఆటో డ్రైవర్లకు ఒక ఆటో స్టాండ్ ను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. జియాగూడలోని మేకల మండిలో నడిరోడ్డుపై మేకలు అమ్ముతున్నారని, వెంటనే మేకల మండిలో పనిచేసే కార్మికులు, ఆరెకటికే వారికి ఉపాధి కోసం నూతనంగా అధునాతనమైన స్లాటర్ హౌస్ ను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కవిత డిమాండ్ చేశారు.
