కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ 22కు వాయిదా

కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ 22కు వాయిదా

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్  స్కాం మనీ లాండరింగ్  కేసులో రెగ్యులర్  బెయిల్  కోసం బీఆర్ఎస్  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. ఈ కేసును విచారిస్తున్న రౌస్  ఎవెన్యూ కోర్టు స్పెషల్  జడ్జి కావేరి బవేజా మంగళవారం సెలవుపై వెళ్లారు. దీంతో ఈ పిటిషన్ పై విచారణను ఈనెల 22కు వాయిదా వేస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. సీబీఐ కేసులో తాజాగా కవిత దాఖలు చేసిన రెగ్యులర్  బెయిల్  పిటిషన్ తో కలిపి ఈ పిటిషన్ ను విచారిస్తామని స్పష్టం చేసింది. 

కాగా, లిక్కర్  స్కాం మనీ లాండరింగ్ కేసులో గత నెల మార్చి 15న హైదరాబాద్ లోని కవిత నివాసంలో ఈడీ అధికారులు ఆమెను అరెస్టు చేశారు. 16న ఆమెను కోర్టులో హాజరుపరుచగా రెండు దఫాలుగా మొత్తం 10 రోజుల ఈడీ కస్టడీకి కోర్టు అప్పగించింది. గత నెల 26న ఆ కస్టడీ ముగియడంతో ట్రయల్  కోర్టు 14 రోజుల కస్టడీ విధించింది. 

ఈ సందర్భంగా తన కొడుకు ఎగ్జామ్స్ నేపథ్యంలో మధ్యంతర బెయిల్, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని రెగ్యులర్  బెయిల్  మంజూరు చేయాలని కవిత రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే మధ్యంతర బెయిల్ పై విచారణ  జరిపిన కోర్టు... కొడుకు ఎగ్జామ్స్ కారణంతో మధ్యంతర రిలీఫ్  ఇవ్వలేమని 
ఆ పిటిషన్ ను కొట్టివేసింది.