
- పొలిటికల్ సర్కిల్లో, బీఆర్ఎస్ వర్గాల్లోనూ డిస్కషన్
- లేఖ ఎట్ల బయటకొచ్చిందనే దానిపైనా అనుమానాలు
- కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు సైలెన్స్
హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ చుట్టూ దయ్యాలు, కోవర్టులు ఉన్నారంటూ కవిత చేసిన కామెంట్లు ఇప్పుడు రాజకీయ వర్గాలతోపాటు బీఆర్ఎస్ పార్టీలోనూ చర్చకు దారితీశాయి. ఆ దయ్యాలు, కోవర్టులు ఎవరని గులాబీ లీడర్లు కూడా ఆరా తీస్తున్నారు. కవిత రాసిన లేఖను ఎవరు బయటకు లీక్ చేశారన్న దానిపై డిస్కస్ చేస్తున్నారు. కవిత లేఖ, తాజా పరిణామాలపై కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు సైలెంట్‌గా ఉన్నారు. పెదవి విప్పడం లేదు. కవిత తన తండ్రి కేసీఆర్‌కు లేఖ రాసి రెండు వారాలవుతున్నా ఇన్నాళ్లూ గుట్టుగానే ఉంది. గురువారం బయటకు లీక్ అయింది. దీంతో పార్టీలో లుకలుకలున్నాయన్న టాక్ జోరందుకుంది.
ఏప్రిల్ 27న నిర్వహించిన బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలప్పుడు కేటీఆర్‌ను రాజకీయ వారసుడిగా చూపించేందుకు కేసీఆర్ ప్రయత్నం చేశారన్న వార్తలు వచ్చాయి. అయితే, పార్టీలో తనకు సమ ప్రాధాన్యం కావాలంటూ కొద్దికాలంగా కవిత చెప్తున్నట్లూ బీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఇదే క్రమంలో కవిత కూడా జాగృతి పేరిట కార్యక్రమాలను నిర్వహిస్తూ.. యాక్టివ్‌గా ఉంటున్నారు. గత పదేండ్లలో సామాజిక తెలంగాణ సాకారం కాలేదంటూ మే డే కార్యక్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. తెలంగాణ భవన్లో మీడియాతో చిట్‌చాట్‌లోనూ ఆమె తన ఆవేదనను వెలిబుచ్చారు. తనను ఇంకా ఎంత ఇబ్బంది పెడతారని, తనపై కుట్రలు జరుగుతున్నాయని అన్నారు.
తండ్రికి రాసిన లేఖకే ప్రైవసీ లేకపోతే..!
ఇప్పుడు కవిత లేఖ బయటకు రావడంతో.. పార్టీలో అంతర్గతంగా ఏదో జరుగుతున్నదన్న చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా సాగుతున్నది. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలపై ఫీడ్ బ్యాక్ ఇస్తూ కవిత ఈ నెల 2న కేసీఆర్‌కు లేఖ రాశారు. అందులో పాజిటివ్, నెగెటివ్ అంశాలను ప్రస్తావించారు. ‘‘డాడీ.. సభలో మీరు బీజేపీని మరింత టార్గెట్ చేయాల్సింది. అలా చేయకపోయే సరికి ఆ పార్టీతో పొత్తుపెట్టుకుంటారనే ఊహాగానాలు మన పార్టీ కేడర్‌లో వినిపిస్తున్నాయి” అని అందులో పేర్కొన్నారు. ఆ లేఖ తానే రాశాననని శుక్రవారం హైదరాబాద్‌కు రాగానే కవిత క్లారిటీ ఇచ్చారు.
ఆ లేఖ ఎలా బయటకు వచ్చిందో ఆలోచించాల్సిన అవసరం ఉందని, తన తండ్రికి రాసిన లేఖకే ప్రైవసీ లేకపోతే.. పార్టీలోని ఇతరుల పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని, కోవర్టులను పక్కన పెట్టాలని అన్నారు. ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్లో ముసలం ముదురుతున్నదనడానికి నిదర్శనమని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ నడుస్తున్నది. ఇంత జరుగుతున్నా ‘గులాబీ’ పెద్దలెవరి నుంచి స్పందన లేదు. కేటీఆర్, హరీశ్ రావు ఇతర అంశాలపై ఎక్స్‌లో ట్వీట్లు పెడుతున్నా.. కవిత లేఖ అంశంపై మాత్రం పెదవి విప్పడంలేదు. ఓ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్‌ను మీడియా ప్రతినిధి.. కవిత లేఖ అంశాన్ని ప్రస్తావించగా.. ‘‘మాట్లాడుతా మాట్లాడుతా బ్రదర్.. మాకు లేని హడావిడి మీకెందుకు?’’ అంటూ వెళ్లిపోయారు.