నేటి కాలంలో వారసత్వాలు లేని రాజకీయాలు అనేది ఊహకందని విషయం. అగ్ర నాయకత్వాల విషయంలో మాత్రం బీజేపీ, కమ్యూనిస్టులు తప్ప అందుకు ఏ పార్టీ వారసత్వ రాజకీయాలకు అతీతం కాదు. కాకపోతే, ఒకే కుటుంబంలో కొడుకు, కూతురు, మేనల్లుడిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తెచ్చిన కేసీఆర్ వ్యూహం అప్పట్లో ఏమై ఉండిందో కానీ, ఇపుడాయనకు ఆ వారసుల నుంచే సమస్యలు రావడం చూస్తున్నాం. కేసీఆర్ కుటుంబం నుంచి తిరుగుబాటు అనేది అసంభవం అనే అభిప్రాయం ఒకప్పుడు ఉండేది. బీఆర్ఎస్ నేతలపై కవిత విమర్శలు చూశాక ఆమెను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారు. దాంతో తిరుగుబాటు ఆమెకు అనివార్యంగా మారిందనే చెప్పొచ్చు! బీఆర్ఎస్ నేతలపై ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఆమె ఒక సంచలన నాయకురాలిగా మారిందిపుడు! కాళేశ్వరం నుంచి కూకట్పల్లి భూకబ్జాల దాకా తీవ్ర ఆరోపణలు చేస్తూ ఆమె ఒక సంచలన నాయకురాలిగా మారిపోయారు.
లిక్కర్ స్కామ్‌తో కవిత పొలిటికల్ కెరీర్‌కు కాస్త ఇబ్బంది ఏర్పడిన మాట నిజమే కావచ్చు. అప్పటికే కేసీఆర్ పదేండ్ల పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్న సమయమది. నిజానికి ఆమె వల్లనే బీఆర్ఎస్ ఓడిపోయిందా అంటే అందుకు ఆధారాలేమీ లేవు! మొదటి నుంచి కూడా పార్టీలో తనకు ప్రాధాన్యమిచ్చేవారు కాదని కవిత చెపుతోంది. ఎంపీగా ఉన్నపుడు తనను నిజామాబాద్‌కు మాత్రమే పరిమితం చేశారని చెపుతోంది. అందులో నిజం ఉండొచ్చు. కానీ లిక్కర్ కేసు తర్వాత నుంచి కేసీఆర్ ఆమెను కలవడం లేదనే వార్తలు విన్నాం. తమ ఓటమికి గల కారణాలలో కవిత కేసు కూడా ఒక కారణమే అని కేసీఆర్ నమ్మినారో లేదా ఆయనకు ఎవరైనా హితబోధ చేశారో తెలియదు! దాంతో ఆమెను దూరంగా ఉంచాలని ఓ నిర్ణయానికి వచ్చి ఉండొచ్చు. అదే ఆమెను తిరుగుబాటుకు పురికొల్పి ఉండొచ్చేమో! మరో కారణం కూడా ప్రచారంలో ఉండింది ఏమిటంటే, పదేండ్ల పాలకుడైన కేసీఆర్ సంపదలో వాటా వివాదం కారణం కావచ్చేమో అనేవారూ ఉన్నారు! కారణం ఏదైనా, బీఆర్ఎస్పై ఆమె తిరుగుబాటు మాత్రం ఒక సాహసమే!
లోక్‌సభలో వాక్పటిమ
2014 నుంచి 2019 వరకు ఆమె ప్రజాసంబంధాలను ఎందుకు కాపాడుకోలేకపోయారో తెలియదు. తమ పార్టీవారే తనను కావాలని ఓడించారని ఆమె చెపుతోంది. నిజానికి కవిత లోక్‌సభలో రాష్ట్ర సమస్యలే కాదు, జాతీయ, అంతర్జాతీయ అంశాలను అలవోకగా హిందీ, ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. జాతీయపార్టీల నేతలకు సైతం ఆమె పార్లమెంట్‌లోని వాక్పటిమ చూసి ఈర్ష్య కలిగేదేమో అనేంతగా ఉండేవి. ఎనీ హౌ.. షీ వజ్ బెస్ట్ స్పీకర్‌గా లోక్‌సభలో పేరు తెచ్చుకున్నారు.
దూరం చేసినవారెవరు?
కవిత18 ఏండ్ల పొలిటికల్ కెరీర్‌ను చూస్తే ఆమెలో కొంత మొండితనం, పట్టుదల కనిపిస్తాయి. షీ ఈజ్ ఏ డేర్ లేడీ ఇన్ పాలిటిక్స్ అని చెప్పొచ్చు. లిక్కర్ కేసు ద్వారా ప్రతిష్ట దెబ్బతిన్నదనుకుంటే, దాన్ని తిరిగి కాపాడుకోవాలనే ఆరాటం కవితలో బాగా పెరిగి ఉండడం సహజం. రాజకీయాల్లో అపవాదుకు గురైనపుడు, కుటుంబం దూరం పెడుతున్నపుడు, తనకు మిగిలింది రాజకీయ మార్గమే అని కవిత భావించిందని ఆమె చేపట్టిన తిరుగుబాటు రాజకీయం స్పష్టంగా చెపుతోంది! అలాగే ఆమెను కేసీఆర్‌కు ఎవరో దూరం చేశారనే అనుమానం ఆమెలో బలంగా ఉంది. కాబట్టే, హరీష్‌రావును, సంతోష్‌ను మొదట్లో బాగా టార్గెట్ చేసింది. వారిద్దరిపై తీవ్రమైన ఆరోపణలూ చేసింది. కాళేశ్వరంలో జరిగిన అవినీతికి హరీశ్‌రావే కారణంగా ఆమె చేసిన విమర్శలు సంచలనంగా మారాయి కూడా!
లెగసీ ఉన్నా.. గట్స్ ఉండాలి!
రాజకీయాల్లో తనకు తాను పాత్ర సృష్టించుకోవడం చాలా కష్టం. ఓ లెగసీ ఉన్నవారు కూడా తనదంటూ పాత్ర పోషించడం కూడా అంత సులభం కాదు. కేసీఆర్ లెగసీ ద్వారా మాత్రమే తెలంగాణ రాజకీయాల్లో కవిత పరిచయం అయింది. సుమారు 15 ఏండ్లుగా ఆమె సోషల్లీ, పొలిటికల్లీ కనెక్టయి కొనసాగుతున్నారు. జాగృతి ఆమె బ్రాండ్ ఇమేజ్. బతుకమ్మ పండుగను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో తన పాత్రను ఎవరూ కాదనలేరనేది ఆమెకున్న స్వాభిమానం. ఆమె చేసిన ఇలాంటి కల్చరల్, సోషల్ యాక్టివిటీ క్రెడిబిలిటీనంతా అప్పట్లో టీఆర్ఎస్కే ఒక మైలేజీగా మార్చుతూ వచ్చింది. నిజానికి ఆమె కేసీఆర్ కూతురే కాకపోయి ఉంటే, ఆమె ఆ యాక్టివిటీని కొనసాగించగలిగేది కాదనేది ఎంత నిజమో... ఆమెలో పొలిటికల్ డేర్‌నెస్ ఉందనేది కూడా అంతే నిజం. ఏది ఏమైనా, ఎవరి లెగసీ ద్వారా ఎదిగి వచ్చినా ఎదగడానకి మనలో కొన్ని గట్స్ కూడా ఉండాలి. ఆ గట్స్ కవితలో ఉన్నాయనే చెప్పొచ్చు.
కొందరి గుప్పిట్లో..
బీఆర్ఎస్, కేసీఆర్ చుట్టూ ఉన్న కొందరి గుప్పిట్లో లోకి వెళ్లిపోయిందని ఆమె చెపుతోంది. పదేండ్ల పాలనా కాలంలో కేసీఆర్‌ను కలవడం ఎంత
దుర్లభంగా ఉండేదో ఆ పార్టీ ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు తెలుసు. పార్టీ కొందరి చేతుల్లో ఉందని ఇపుడు కవిత చెపుతున్నదీ కూడా అదే!
అనైతిక ప్రతిపక్షం వల్ల కవితకు కలిసొస్తుందా?
2029 ఎన్నికల్లో కవిత పోటీ చేస్తానంటోంది. పార్టీ పెడతానంటోంది. ఆమె పార్టీ పెడితే ఎన్నికల్లో గెలవలేదు అనే అభిప్రాయం సర్వత్రా ఉన్నదే. ఎన్నికల్లో ఆమె గెలుపోటములను పక్కనపెడితే..ప్రజాసమస్యలను మాత్రం బలంగానే లేవనెత్తుతున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో పదేండ్లుగా పాలించిన బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నది. రెండేండ్లుగా కాంగ్రెస్ అధికారంలో కొనసాగుతున్నది. నిజానికి కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ ఎన్ని విమర్శలు చేసినా అవి నైతికంగా నిలబడలేక పోతున్నాయి. అలాగే, అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు రెండేండ్ల హనీమూన్ పిరియడ్ పూర్తయింది. కాబట్టి బీఆర్ఎస్ను విమర్శించే పరిస్థితులు కూడా కాంగ్రెస్‌కు తగ్గిపోతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లను కలిపి విమర్శించే అవకాశం బీజేపీకి ఉన్నా.. ఆ పార్టీ అంతర్గత కలహాలతో, నాయకత్వలేమితో కొట్టుమిట్టాడుతోంది. కాబట్టి, అధికార కాంగ్రెస్‌ను, ప్రతిపక్ష బీఆర్ఎస్ను కలిపేసి విమర్శించే అవకాశాన్ని కవిత కొంతమేర వాడుకోగలుగుతోంది. (రాబోయే కాలంలో ఆమె మరింత బలంగా నిలబడగలిగితే, మరింతగా వాడుకునే అవకాశాలు పెరగొచ్చు) దాంతో ఆమె ప్రత్యామ్నాయం కాబోతుందని ఇప్పుడు చెపితే అది అబద్ధమే అవుతుంది! కానీ, ప్రజా సమస్యలను లేవనెత్తగలుగుతుందని మాత్రం చెప్పొచ్చు. ఏది ఏమైనా, ఆమె కొంతకాలానికి తిరిగి బీఆర్ఎస్ గూటికే చేరతారా అనే అనుమానాలు లేకపోలేదు. అందుకు కవిత మాత్రం ‘ముమ్మాటికి కాదు’ అనే చెపుతున్నది. కానీ, అందుకు సమాధానం చెప్పాల్సింది మాత్రం కాలమే!
మహిళా రిజర్వేషన్లు కలిసొచ్చేనా?
2029 నుంచి చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు అమలు జరగబోతున్నాయి. 33 శాతం మహిళలు అటు లోక్‌సభలో, ఇటు శాసనసభల్లో ఉండబోతున్నారు. యాక్టివ్ పాలిటిక్స్‌లో అసలే మహిళలు తక్కువ. ఇది కవిత రాజకీయ సాహసానికి ఎంతో కొంత ఉపయోగపడొచ్చేమో కాలమే చెప్పగలదు. యాక్టివ్ మహిళా పొలిటీషియన్స్‌కు మహిళా రిజర్వేషన్లు బాగా కలిసొచ్చే అంశం అని మాత్రం చెప్పొచ్చు!
ఆమె ఒక సాహసే!
ప్రస్తుత రాజకీయాల్లో.. బెయిల్‌పై వచ్చి రాష్ట్రాలకు సీఎంలు అవుతున్నవారు ఉన్నారు. అలాంటపుడు లిక్కర్ కేసు వల్లనే ఆమెను పక్కన పెట్టి ఉంటే మాత్రం అది బీఆర్ఎస్కు లాభం కన్నా నష్టమే ఎక్కవ! కవిత తిరుగుబాటుకు ఎవరు ఏ కారణాలు చెప్పుకున్నా.. ఆమె ఒక ‘రాజకీయ సాహసి’ అని మాత్రం చెప్పొచ్చు. విపులంగా చెప్పాలంటే, ఆమెది ఫలితం ఆశించని సాహసం! ఇలాంటి పొలిటీషియన్స్ ఈ కాలంలో చాలా తక్కువే. రాజకీయాల్లో లక్ష్యంతో పనిచేసేవారికి ఏదైనా సాధ్యమే! కానీ, లక్ష్యం లేకుండా అతిగా ఊహించుకునేవారికి మాత్రం అది అసాధ్యమే! మొత్తం మీద కవిత పొలిటికల్ జర్నీ ఏ మలుపు తీసుకుంటుందో, ఆమెకు లక్ష్యం ఉన్నదా, లేదా చూడాలంటే మాత్రం మరో మూడేండ్లు ఆగి చూడాల్సిందే!
ఎక్కుపెట్టిన విమర్శలు
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో జరిగిన అవినీతిని ఇపుడామె బలంగా ఎత్తిచూపుతోంది. ప్రశ్నిస్తోంది. చివరకు కేసీఆర్ పాలనలో రైతులకు బేడీలు వేసిన సంఘటనకు స్వయాన ఆమె క్షమాపణ చెప్పడం గమనార్హం. ఇపుడామె తెలంగాణలో ప్రతి నియోజకవర్గంలో ‘జాగృతి జనం బాట’ పేరుతో తిరుగుతున్నారు. ప్రజలతో మమేకమై ప్రత్యక్షంగా కలియ తిరుగుతోంది. ఆయా జిల్లాలలోని ప్రజా సమస్యలను ఆమె స్టడీ చేసి మరీ మాట్లాడుతోంది. ఆ సమస్యలన్నిటికి అప్పటి బీఆర్ఎస్ ప్రధాన కారణమైతే.. ఇప్పటికీ అవి నెరవేరనపుడు కాంగ్రెస్ ప్రభుత్వం కారణంగా ఆమె విమర్శలను ఎక్కుపెడుతోంది. ఆయా నియోజకవర్గాలకు వెళ్లినపుడు, అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతి చిట్టాలపై, భూ కబ్జాలపై నిర్మొహమాటంగా మాట్లాడటాన్ని అక్కడి ప్రజలు సైతం హర్షిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది!
- కల్లూరి శ్రీనివాస్‌రెడ్డి
సీనియర్ జర్నలిస్ట్
