- జీవో ఇచ్చిన సర్కారు
హైదరాబాద్ సిటీ, వెలుగు : కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల ప్రాజెక్టులో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఈ మేరకు ఎంఏయూడీ మంగళవారం జీవో 927 జారీ చేసింది. గతంలో ప్రతిపాదించిన పలు అండర్‌పాస్‌లు, గ్రేడ్ సెపరేటర్లకు బదులుగా రెండు స్టీల్ ఫ్లైఓవర్ల నిర్మాణానికి ఆమోదముద్ర వేసింది. ప్యాకేజీ–-1 పరిధిని జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ జంక్షన్ నుంచి ముగ్ధ జంక్షన్ వరకు స్టీల్ ఫ్లైఓవర్‌గా మార్చింది. ప్యాకేజీ-2లో ముగ్ధ జంక్షన్ నుంచి ముఫకంజా కాలేజ్ వరకు, బంజారాహిల్స్ రోడ్ నంబర్-1కి అనుసంధాన ర్యాంప్‌తో స్టీల్ ఫ్లైఓవర్ నిర్మించనున్నారు.
ఈ రెండు ప్యాకేజీల పనులను ఇప్పటికే ఈపీసీ కాంట్రాక్టర్‌గా ఉన్న మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ కే అప్పగించేందుకు ప్రభుత్వం అనుమతించింది. మరోవైపు ఎన్‌ఎఫ్‌సీఎల్, టీవీ9 జంక్షన్ల వద్ద గ్రేడ్ సెపరేటర్ల నిర్మాణానికి గతంలో జారీ చేసిన జీవో 835ను రద్దు చేసింది. ఈ పనులకు కేఎన్‌ఆర్ కన్స్ట్రక్షన్స్కు ఇచ్చిన ఎల్‌ఓఏను కూడా రద్దు చేసి, సంస్థ డిపాజిట్ చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఆదేశించింది. కేబీఆర్ పార్క్ ప్రాజెక్టుకు సంబంధించిన సవరించిన ప్రతిపాదనలను ఈపీసీ కమిటీ–3 ముందు ఉంచాలని సూచించింది. ప్రస్తుత ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ల సేవలను కొనసాగించేందుకు కూడా అనుమతించింది.
