
బషీర్బాగ్, వెలుగు: తెలంగాణ ప్రజాధనాన్ని కొల్లగొట్టిన సీఎం కేసీఆర్పై గజ్వేల్లో పోటీ చేయనున్నట్లు సోషలిస్ట్ పార్టీ(ఇండియా) అధ్యక్షురాలు,1969 తొలిదశ ఉద్యమకారిణి రచ్చ సుభద్రా రెడ్డి స్పష్టం చేశారు. హైదర్ గూడలోని ఎన్ఎస్ఎస్లో నిర్వహించిన సమావేశంలో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసిన ఆమె 14 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించారు. అనంతరం సుభద్ర మాట్లాడుతూ.. చిన్న, సన్నకారు రైతులకు మాత్రమే రైతు బంధు ఏడాదికి రూ.20 వేలుతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 58కి తగ్గించి నిరుద్యోగులకు అవకాశం కల్పిస్తామనే ప్రధాన ఎజెండాతో ముందుకెళ్తున్నామన్నారు.
రాష్ట్రంలో మద్యపాన నియంత్రణ, ప్రైవేటు విద్యను నిషేధిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్ని రంగాల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. సోషలిస్ట్ సమజ స్థాపన కోసం పాటు పడుతుందన్నారు. తెలంగాణ ఉద్యమకారులను తమ పార్టీ నుంచి పోటీకి ఆహ్వానిస్తున్నామన్నారు. కేసీఆర్తో పాటు మంత్రులపై బలమైన అభ్యర్థులను నిలబెట్టి వారిని ఓడిస్తామని ఆమె స్పష్టం చేశారు.