మునుగోడులో రాజగోపాల్ రెడ్డికి డిపాజిట్ కూడా రాదు

మునుగోడులో రాజగోపాల్ రెడ్డికి డిపాజిట్ కూడా రాదు

సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణను దరిద్ర తెలంగాణగా మార్చారని కేఏ పాల్ ఆరోపించారు. టీఆర్ఎస్కు 15 కోట్లు ఇచ్చానని.. దానికి దిలీప్ కుమార్, కవిత సాక్ష్యమని చెప్పారు. కేసీఆర్ అవినీతిపై మాట్లాడితే చంపేస్తామని కొందరు బెదిరిస్తున్నట్లు తెలిపారు. అబద్ధాలను కేసీఆర్ నిజాలని నమ్మిస్తారని.. ప్రజల్లో ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉందని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్ రోడ్లపై తిరిగితే ప్రజలు కొడతారని వ్యాఖ్యానించారు.  మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి డిపాజిట్ కూడా రాదన్నారు. 

మునుగోడులో బీసీ లేదా దళిత వ్యక్తికి పార్టీలు ఎందుకు టికెట్ ఇవ్వట్లేదని కేఏ పాల్ ప్రశ్నించారు. మునుగోడు నియోజకవర్గంలోని 175 గ్రామాల్లో ప్రజాశాంతి పార్టీ కమిటీలు ఉన్నాయని తెలిపారు. టీఆర్ఎస్ బీజేపీ బీ పార్టీ అని ఆరోపించారు. అబద్దాల్లో కేసీఆర్..మోసం చేయడంలో చంద్రబాబు నంబర్ వన్ అని అన్నారు. చంద్రబాబు తనవల్లే సీఎం అయ్యారని చెప్పారు. తన డబ్బు తీసుకోని నాయకుడు లేడని తెలిపారు. మోడీకి 2007 నుంచి 2014 వరకు ప్రచారం చేశానని.. ఆయన ప్రధాని అవ్వడానికి తనే కారణమన్నారు.

ప్రస్తుతం దేశంలో డర్టీ పాలిటిక్స్ నడుస్తున్నాయని..దేశం శ్రీలంకలా మారిందని కేఏ పాల్ అన్నారు. నిస్వార్థంగా సేవ చేస్తున్న తనను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. తనకు గతంలో కాంగ్రెస్, బీజేపీ కేంద్రమంత్రి ఆఫర్ ఇచ్చారని.. అయితే వాటిని తిరస్కరించినట్లు చెప్పారు. మోడీ అధికారంలోకి వచ్చాక కోన్ని వేల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు.