22 నుంచి కేసీఆర్‌‌‌‌‌‌‌‌ బస్సు యాత్ర

22 నుంచి కేసీఆర్‌‌‌‌‌‌‌‌ బస్సు యాత్ర

హైదరాబాద్, వెలుగు: లోక్‌‌‌‌సభ ఎన్నికల ప్రచారం కోసం ఈ నెల 22 నుంచి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఇందుకోసం ఎలక్షన్ కమిషనర్ నుంచి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ పర్మిషన్ కోరింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి కేతిరెడ్డి వాసుదేవరెడ్డి శుక్రవారం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) వికాస్‌‌‌‌ రాజ్‌‌‌‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు.

 ఈ నెల 22 నుంచి మే 10వ తేదీ వరకు యాత్ర ఉంటుందని, ఇందుకు పర్మిషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. యాత్రకు పోలీసు సహకారం అందేలా ఆదేశాలివ్వాలని కోరారు. అయితే, బస్సు యాత్రకు సంబంధించి రూట్‌‌‌‌ మ్యాప్‌‌‌‌పై తర్జన భర్జన కొనసాగుతోంది. పార్టీ వర్కింగ్‌‌‌‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌‌‌‌‌‌‌, మాజీ మంత్రి హరీశ్‌‌‌‌ రావు నందినగర్‌‌‌‌‌‌‌‌లోని కేసీఆర్ నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. 

కొంత మంది పార్టీ ముఖ్య నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ ఎంపీ అభ్యర్థులు ఇచ్చిన నియోజకవర్గ రూట్‌‌‌‌ మ్యాప్‌‌‌‌లు, ఇతర వివరాలతో ఫైనల్ రూట్‌‌‌‌ మ్యాప్ తయారీపై చర్చించారు. జోగులాంబ గద్వాల నుంచి యాత్రను ప్రారంభించాలని తొలుత భావించినా.. వేములవాడ రాజన్న ఆలయం నుంచి స్టార్ట్ చేయాలని మరో ప్రతిపాదనపై సమావేశంలో చర్చించినట్టు తెలిసింది. శనివారం యాత్ర రూట్‌‌‌‌ మ్యాప్‌‌‌‌ను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ప్రతి రోజూ సాయంత్రం యాత్ర నిర్వహించనుండగా, ఉదయం, మధ్యాహ్నం చిన్న చిన్న సభలు, సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. 

రైతులు, ప్రైవేటు ఉద్యోగులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులతో వేర్వేరుగా భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ మీటింగ్‌‌‌‌ల్లో తొలుత వారితో మాట్లాడించడం, ఆ తర్వాత కేసీఆర్ ప్రసంగించేలా కార్యక్రమాలను రూపొందించనున్నట్టు తెలిసింది. ఏయే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న దానిపై కూడా సమావేశంలో చర్చ జరిగిందని, రైతులు, నీటి కొరత, విద్యుత్ కోతలపైనే ఎక్కువ ఫోకస్ చేయాలని సమావేశంలో పాల్గొన్న మెజార్టీ నాయకులు అభిప్రాయపడ్డారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.