కేసీఆర్​ కేబినెట్ దొంగల ముఠా

కేసీఆర్​ కేబినెట్ దొంగల ముఠా
  • వాళ్లకు దోచుకోవడంపైనే ధ్యాస: తరుణ్​ చుగ్
  • ఆ ఆందోళనతోనే బీజేపీ కార్యకర్తలపై దాడులని ఫైర్​
  • పార్టీ రాష్ట్ర నేతలతో తన ఇంట్లో చుగ్​ సమావేశం

న్యూఢిల్లీ, వెలుగు: కేసీఆర్​ అవినీతి ముఖ్యమంత్రి అని, ఆయన కేబినెట్​ అలీబాబా 40 దొంగల ముఠాగా తయారైందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ తరుణ్​చుగ్​ విమర్శించారు. తెలంగాణ ప్రజలు కడ్తున్న పన్నులను ఎలా దోచుకోవాలన్న విషయంపైనే ఆ దొంగల ముఠా దృష్టి పెట్టిందన్నారు. ఏ పథకంలో ఎలా డబ్బును నొక్కేయాలన్న దానిపైనే ఆలోచిస్తుందన్నారు. బుధవారం ఆయన తన ఇంట్లో పార్టీ రాష్ట్ర నేతలతో సమావేశం అయ్యారు. ప్రధాని మోడీ కామెంట్లను వక్రీకరిస్తూ కేసీఆర్​ సొంత పత్రిక రాసిన కథనాలు, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, పార్టీలో అసమ్మతి అంశాలపై చర్చించారు. తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు బీజేపీ గర్వించే విషయమని ఆయన అన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత సీఎం కేసీఆర్​దేనని, అందులో ఆయన పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. కేసీఆర్​ పూర్తిగా దారితప్పిపోయారని మండిపడ్డారు. 
రాష్ట్రంలో కేసీఆర్​ పట్టుకోల్పోతున్నారని, అందుకే ప్రధాని మోడీపై అనుచిత, అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని తరుణ్​ చుగ్​ విమర్శించారు. మోడీలా పనిచేయాలని కేసీఆర్​ పగటి కలలు కంటున్నారని, అది ఆయన వల్ల కానిపని అని అన్నారు. 2014 నుంచి కేసీఆర్​ నిజ స్వరూపాన్ని ప్రజలు చూస్తున్నారన్నారు. ముందునుంచీ అవినీతి, కుటుంబ, నియంతృత్వ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల జరిగిన ఎన్నికల లాగానే రాబోయే ఎన్నికల్లోనూ కేసీఆర్​ ఓడిపోవడం ఖాయమన్నారు. టీఆర్​ఎస్​ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు. ఆ ఆందోళనతోనే బీజేపీ కార్యకర్తలపై టీఆర్​ఎస్​ సర్కార్​, కేసీఆర్​ దాడులు చేయిస్తున్నారని, అక్రమ కేసులను బనాయిస్తున్నారని ఫైర్​ అయ్యారు. ఆ దాడులను సహించేది లేదన్నారు. రాష్ట్రంలో కోల్పోతున్న ఇమేజ్​ను కాపాడుకునేందుకు కేసీఆర్​ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, అయినా తనను తాను కాపాడుకోలేరని తరుణ్​ చుగ్​ అన్నారు. 
పార్టీ కేడర్​లో విభేదాల్లేవ్​
పార్టీ రాష్ట్ర కేడర్​లో ఎలాంటి విభేదాల్లేవని తరుణ్​చుగ్​ అన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్​ నేతృత్వంలో అందరూ కలిసి పనిచేస్తున్నారని చెప్పారు. పార్టీలో అంతర్గత సమావేశాలు జరగడం కామన్​ అని, వాటి గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అసమ్మతి వర్గంతో సంజయే రహస్య మీటింగ్​ పెట్టి ఉండొచ్చని కామెంట్​ చేశారు.