గవర్నర్, హైకోర్టు తిట్టినా కేసీఆర్​కు బుద్ధి వస్తలేదు

గవర్నర్, హైకోర్టు తిట్టినా కేసీఆర్​కు బుద్ధి వస్తలేదు

ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిలేశారు: ఉత్తమ్, భట్టి ఫైర్

యశోదా హాస్పిటల్ లో కేసీఆర్ వాటా ఎంత?

సూట్ కేసులు ఎవరికి  వెళ్తున్నాయని ప్రశ్న

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా డెత్స్​పై తప్పుడు రిపోర్టులు ఇస్తున్నట్టు హైకోర్టే నిలదీసిందని, టెస్టులు పెంచాలంటూ గవర్నర్​ ట్వీట్లు చేశారని.. గవర్నర్, హైకోర్టు తిట్టినా సీఎం కేసీఆర్​కు బుద్ధిరావడం లేదని పీసీసీ చీఫ్​ ఉత్తమ్, సీఎల్పీ నేత భట్టి మండిపడ్డారు. రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాల్లో ఎక్కడా వసతుల్లేవని, సరిపడా డాక్టర్లు లేరని చెప్పారు. అయినా సర్కారు నిర్లక్ష్యం వీడటం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్​ రాష్ట్ర నేతలు గత నెల 26 నుంచి పలు జిల్లాల్లోని ప్రభుత్వ దవాఖానాలను పరిశీలించారు. హాస్పిటళ్లలో వసతుల లేమి, కరోనాతో జనం ఇబ్బందులు, ఇతర అంశాలపై నివేదికను సిద్ధం చేశారు. హాస్పిటళ్లలో వసతుల లేమిపై శనివారం ఇందిరా భవన్ లో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. దీనిని ఉత్తమ్, భట్టి పరిశీలించి మాట్లాడారు. ‘‘ప్రైవేట్ హాస్పిటళ్లతో సీఎం కేసీఆర్ లాలూచీ పడుతున్నరు. యశోదా హాస్పిటల్లో సీఎం కేసీఆర్ వాటా ఎంతో స్పష్టం చేయాలి. ప్రైవేట్ హాస్పిటల్స్ తో ఈటలకు పనేం ఉంది. సూట్​కేసులు ఎవరి ఇంటికి వెళ్తున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్ లో సగం బెడ్లు తీసుకున్నామన్న ప్రభుత్వం ఎక్కడ తీసుకుందో వెల్లడించాలి. కేసీఆర్, ఈటల రాజేందర్  కరోనా పేరుతో తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. ప్రాజెక్టుల్లో కమీషన్ కోసం దోచుకొన్నది చాలదా?’’ అని ఉత్తమ్​ విమర్శించారు. జిల్లాకో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్​ కడతామన్న సీఎం హామీ ఏమైందని నిలదీశారు. హుజూరాబాద్ లో ఈటల అరాచకం చేస్తున్నారని,  అక్రమ కేసులు పెట్టించి హాస్పిటల్​ ఉద్యోగి ప్రవీణ్ యాదవ్ ను చంపించారని ఆరోపించారు.

అసెంబ్లీలో నిలదీస్తం

10 రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల ప్రభుత్వ హాస్పిటళ్లను సందర్శించామని, ఎక్కడా కనీస వసతుల్లేవని, సిబ్బంది లేరని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు.గత ఆరేండ్లలో టీఆర్ఎస్​ సర్కారు కొత్తగా ఒక్క హాస్పిటల్​ను కూడా కట్టలేదని విమర్శించారు. ప్రైవేటు హాస్పిటళ్లు జలగల్లా జనం రక్తాన్ని పీల్చుతుంటే సర్కారు ఎందుకు ఆపలేకపోతోందని నిలదీశారు. సర్కారు హాస్పిటళ్లలో వసతుల లేమి, సిబ్బంది కొరతపై త్వరలో గవర్నర్ ను కలుస్తామన్నారు.