అధికారంలో ఉండే అర్హత కేసీఆర్ కు లేదు: కిషన్ రెడ్డి

అధికారంలో ఉండే అర్హత కేసీఆర్ కు లేదు: కిషన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: నిరుద్యోగులను సీఎం కేసీఆర్ మోసం చేశారని, రాష్ట్ర యువత భవితకు భరోసా కల్పించలేని ఆయనకు అధికారంలో ఉండే అర్హత లేదని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర సర్కార్ అసమర్థత, వైఫల్యం కారణంగా వరుసగా రెండోసారి గ్రూప్-1 పరీక్ష రద్దయిందని శనివారం ఒక ప్రకటనలో మండిపడ్డారు ‘‘నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో పోరాడి తెలంగాణ తెచ్చుకున్నం. ఇప్పటికే నీళ్లు, నిధుల విషయంలో దగా పడుతున్నం. ఇప్పుడు నియామకాల విషయంలోనూ ప్రభుత్వ వైఫల్యం యువతకు శాపంగా మారింది. గతంలో పేపర్ లీకేజీ కారణంగా గ్రూప్ 1 పరీక్ష రద్దు చేశారు. ఈసారైనా ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరిస్తుందని అనుకున్నాం. కానీ అదే నిర్లక్ష్యం ప్రదర్శించింది” అని అందులో పేర్కొన్నారు.

మద్యంపై ఉన్న శ్రద్ధ.. జాబ్ లపై లేదు: డీకే అరుణ

రాష్ర్ట ప్రభుత్వానికి మద్యం నోటిఫికేషన్లపై ఉన్న శ్రద్ధ.. జాబ్ నోటిఫికేషన్లపై లేదని బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ విమర్శించారు. బయోమెట్రిక్ విధానం పెడితే ఖర్చవుతుందని ప్రభుత్వం కక్కుర్తి పడడం వల్ల లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. ‘‘తెలంగాణ ఏర్పడిన తర్వాత  మద్యం నోటిఫికేషన్లు తప్ప.. ఏ నోటిఫికేషన్ సక్రమంగా జరగలేదు. యువతకు ఉద్యోగాలు ఇవ్వొద్దనే.. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గ్రూప్ -1 పరీక్ష రాసిన అభ్యర్థులకు ప్రభుత్వం వెంటనే  నష్ట పరిహారం చెల్లించాలి” అని అందులో డిమాండ్ చేశారు. టీఎస్ పీఎస్సీని వెంటనే ప్రక్షాళన చేయాలని, పరీక్ష రద్దుకు చైర్మన్ బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.