దశాబ్దిలోకి తెలంగాణ : పేదలు చదువుకోవడం కేసీఆర్​కు నచ్చదు

దశాబ్దిలోకి తెలంగాణ : పేదలు చదువుకోవడం కేసీఆర్​కు నచ్చదు

కేసీఆర్ కు పేద పిల్లలకు చదువు చెప్పడం ఇష్టం ఉండదు. గురుకులాల సెక్రటరీగా పని చేసిన కాలంలో ఒక అధికారిగా చాలా సందర్భాల్లో ఈ విషయం నేను గమనించాను. పేద పిల్లలకు ఏ సౌకర్యం కల్పించాలని ప్రయత్నం చేసినా నెలల తరబడి ఫైల్స్ పెండింగ్ లో ఉండేవి. గురుకుల విద్యార్థులతో ఇంకెన్నో అద్భుతాలు చేయాలని ప్రయత్నించినా, అడుగడుగున అడ్డుకునే ప్రయత్నమే జరిగింది. పేద పిల్లలు పేదలుగానే ఉండాలని, విదేశాలకు వెళ్లడం, కంపెనీలకు యజమానులు కావడం, గొప్ప పారిశ్రామికవేత్తలుగా తయారుకావడం, విదేశీ యూనివర్సిటీలలో ఉన్నతంగా చదవడం మన సీఎంకు నచ్చదు. అందుకే ఢిల్లీలో చదివే 300 మంది పేద విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కూడా లేకుండా చేశారు. 

తెలంగాణ ప్రజలు,విద్యార్థి లోకం ఇది గమనించాలి. పేపర్ లీకేజీ అంశంపై నెల రోజుల కింద ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీలో విద్యార్థుల నుద్దేశించి మాట్లాడేందుకు వెళ్లినప్పుడు 2009-11 మధ్య విద్యార్థుల నుంచి ఏ సమస్యలు విన్నానో, మళ్లీ అదే సమస్యలు వారి నోటివెంట పదేండ్ల తరువాత కూడా విన్నాను. పదేండ్లలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి ఇదేనా అని బాధపడ్డాను. తెలంగాణ వచ్చాక విద్యారంగంలో వచ్చిన మార్పేమిటో విద్యాదినోత్సవం రోజు సీఎం చెప్పాలి.

హాస్టళ్లలో ఫుడ్​పాయిజన్​లు ఎందుకైతున్నయ్

ప్రభుత్వ యూనివర్సిటీలను గాలికొదిలేసి ప్రైవేట్ యూనివర్సిటీలకు ఎందుకు అనుమతి ఇస్తున్నారో ఈ ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీల ఎన్నికల ఖర్చు భరించేంత సొమ్ము ఉన్న కేసీఆర్ పాలించే రాష్ట్రంలో హాస్టళ్లలో పేద పిల్లలు ఫుడ్​పాయిజన్ ఘటనలలో అనారోగ్యం బారిన పడాల్సిన దుస్థితి ఎందుకొచ్చిందో చెప్పాలి. ఇలాంటి విద్యావ్యతిరేక ప్రభుత్వం మనకు అవసరమా? కేవలం మన బహుజన రాజ్యంలో మాత్రమే పేద బిడ్డలకు అంతర్జాతీయ స్థాయి విద్య అందుతుంది. బహుజన రాజ్యంలోనే తెలంగాణ అమరుల ఆశయాలు నెరవేరుతాయని గుర్తించాలి. ఒకవైపు లీకులు చేస్తూ, ఇంకోవైపు విద్యాదినోత్సవం జరిపే దొంగల ప్రభుత్వాన్ని గద్దెదించాలి. 

‌‌ – - డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు, బహుజన్ సమాజ్ పార్టీ