కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలకు కేసీఆరే బాధ్యుడు.. సమగ్ర దర్యాప్తు చేపట్టాలి: కోదండరాం

కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలకు కేసీఆరే బాధ్యుడు.. సమగ్ర దర్యాప్తు చేపట్టాలి: కోదండరాం
  • బాధ్యులపై కేసులు ఎందుకు పెట్టలె: రిటైర్డ్​ ఇంజినీర్లు
  • రికార్డుల కోసం కట్టడం వల్లే ఈ సమస్యలు
  • ఇది పెద్ద స్కామ్.. ఎంక్వైరీ చేయించాలని డిమాండ్​
  • కాళేశ్వరం ప్రాజెక్టుపై రౌండ్​టేబుల్ సమావేశం

హైదరాబాద్/ఖైరతాబాద్, వెలుగు: కాళేశ్వరం లిఫ్ట్​ఇరిగేషన్ ప్రాజెక్టులో లోపాలకు కేసీఆరే బాధ్యుడని, ఇంజినీర్లు చేయాల్సిన పనిని ఆయన చేయడంతోనే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని టీజేఎస్​ చీఫ్ కోదండరాం ఆరోపించారు. ప్రాజెక్టుపై మంత్రులు ఇకనైనా ప్రగల్భాలు పలకడం ఆపాలన్నారు. మేడిగడ్డ బ్యారేజీ సహా కాళేశ్వరం ప్రాజెక్టులోని మిగతా పనులకు సర్వేలే చేయలేదని, ఉంటే ఆ రిపోర్ట్‌‌‌‌లు బయట పెట్టాని డిమాండ్ చేశారు.

గిన్నిస్ ​రికార్డులే తప్ప పనుల్లో నాణ్యతను పట్టించుకోలేదన్నారు. ‘‘కుంగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలకు పరిష్కార మార్గాలు ఏమిటి?’’ అంశంపై శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్​లో తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కోదండరాం మాట్లాడారు. రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలన లేదని చెప్పడానికి కాళేశ్వరం ప్రాజెక్టే సాక్షంగా నిలుస్తుందన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్, దేవాదుల ప్రాజెక్టులు ఇప్పటికీ పటిష్టంగా ఉన్నాయని, మరి కాళేశ్వరం ప్రాజెక్టులోనే లోపాలు ఎందుకు బయట పడుతున్నాయో చెప్పాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇంజినీరింగ్​ఎక్స్​పర్ట్​లతో సమగ్ర దర్యాప్తు చేపట్టాలన్నారు. 

అన్నారం, సుందిళ్లలో కూడా లోపాలు

రిటైర్డ్ ఇంజినీర్లు కట్టడంతోనే మేడిగడ్డ కుంగిపోయిందని మాజీ ప్రొఫెసర్ ​రమేశ్​రెడ్డి విమర్శించారు. ఈ ప్రాజెక్టు నిర్మించే ముందు ఎలాంటి రీసెర్చ్ చేయలేదన్నారు. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం మేడిగడ్డ ఘటనకు బాధ్యులపై ఎందుకు కేసులు నమోదు చేయలేదో చెప్పాలని సీనియర్ ​జర్నలిస్టు జయసారథి రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు నిర్మాణ సంస్థ, అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. అన్నారం, సుందిళ్లలోనూ లోపాలున్నాయన్నారు. ప్రాణహిత - చేవెళ్లను పక్కనబెట్టి కాళేశ్వరం ఎందుకు కట్టారో చెప్పాలని రిటైర్డ్​ ఇంజినీర్​రఘుమారెడ్డి డిమాండ్ ​చేశారు. ప్రాజెక్టు రికార్డులు సీజ్​ చేయాలని, బాధ్యులపై కేసులు పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్​ ఇంజినీర్​ వెంకటరమణ, అధ్యయన వేదిక అధ్యక్ష, కార్యదర్శులు వేణుగోపాల్​రెడ్డి, సాధిక్​ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వమే దోషి

కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలకు ప్రభుత్వమే దోషి. ఇంజినీర్లు, కాంట్రాక్టు సంస్థలు కూడా దోషులే. కాళేశ్వరం అంటే కేసీఆర్ ఖజానా కోసం కట్టిన ప్రాజెక్టు. ఇదో పెద్ద కుంభకోణం. దీనిపై విచారణ జరపాలి.

 సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి

రీ సర్వే చేయాలి

కాళేశ్వరం ప్రాజెక్టుపై రీ సర్వే చేయాలి. బ్యారేజీలను 3 నుంచి 5 టీఎంసీలు మాత్రమే నిల్వ చేసేలా నిర్మిస్తారు. కానీ కాళేశ్వరం బ్యారేజీల్లో భారీగా నీటిని నిల్వ చేయడం సమస్యకు దారితీసింది. మేడిగడ్డలో నీటిని డైవర్షన్ ​చేసే అవకాశం లేదు. పర్మియబుల్ ​ఫౌండేషన్​తో బ్యారేజీ కట్టారు. దీంతో బ్యారేజీ ముందు భాగంలో ఇసుక మేటలు వేస్తున్నాయి.           - రిటైర్డ్ ​సీఈ నర్సింహారావు

ప్రభుత్వం తప్పులు చేసింది

ప్రాజెక్టును హడావుడిగా నిర్మించడంతోనే సమస్యలు వస్తున్నాయి. ప్రాజెక్టులో ప్రభుత్వం తప్పులు చేసింది. దీని పటిష్టతపై కేంద్రం రీచెక్ చేయించాలి. 

రిటైర్డ్ ​ఎస్ఈ నల్లవెల్లి రంగారెడ్డి

మెయింటనెన్స్​ లేకే సమస్య

మేడిగడ్డలో ఆపరేషన్స్ అండ్​ మెయింటనెన్స్ సరిగాలేకే సమస్య వచ్చింది. వాటర్ ఫ్లో కంటిన్యూటీ ఉన్న చోటనే బ్యారేజ్ నిర్మించాలి. మేడిగడ్డను బ్యారేజీ రూపకంగా నిర్మించి రిజర్వాయర్​గా నీటిని నిల్వ చేస్తున్నారు. దానివల్ల బ్యారేజీపై ప్రభావం పడి ఉంటుంది.

 రిటైర్డ్ ఇంజినీర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి