
కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేపట్టిన కాళేశ్వరం టూర్ పై చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన విధ్వంసకరంగా సాగిందన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనలో గడిచిన 10 ఏళ్లలో అన్ని శాఖల్లో విపరీతమైన అవినీతి జరిగిందన్నారు. ముఖ్యంగా కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారన్నారు. కాళేశ్వరంపై కేటీఆర్ అవగాహన పెంచుకోవాలన్నారు. వరదలతోనే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిండుతోందని.. అందులో కాళేశ్వరం పాత్ర లేదన్నారు. కేటీఆర్ ధర్నాలు కాదు.. ముందు ప్రాజెక్ట్ పై అవగాహన పెంచుకోవాలన్నారు. కేసీఆర్ ఫ్యామిలీ తెలంగాణ సంపదను దోచుకుందన్నారు.
కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో నష్టపోయిన రైతులకు సాయం చేస్తామని యాత్ర చేస్తే బాగుండేది కానీ పొలిటికల్ అటెన్షన్ కోసం మాత్రమే యాత్ర చేసారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరంపై NDSA రిపోర్టును కూడా కేటీఆర్ తప్పు అంటున్నారు. ప్రచారం కోసమే కేటీఆర్ కాళేశ్వరం టూర్ చేపట్టారు. కాళేశ్వరం ఫిల్లర్లు కుంగిపోవడంతో గతేడాది ఎత్తిపోసిన నీళ్లు వృధాగా పోయాయని దీంతో కరెంటు బిల్లు దండగ అయిందన్నారు. ప్రాజెక్టులు ఇచ్చినందుకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు కంపెనీలు విరాళాలు ఇచ్చాయని తెలిపారు. మరోవైపు కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం అందరం కొట్లాడాలని పిలుపునిచ్చారు.