హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. రెండేండ్ల నుంచి మౌనంగా చూస్తున్నామని.. ఇక ఈ అన్యాయాన్ని సహించేది లేదన్నారు. ఇవాళ్టి నుంచి ఒక లెక్క.. రేపటి నుంచి మరో లెక్క.. ఈ ప్రభుత్వం తోలు తీస్తామని హెచ్చరించారు. తెలంగాణకు అన్యాయం చేస్తోన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఇక పోరాటమేనని స్పష్టం చేశారు.
గ్రామ గ్రామాన ఉద్యమాన్ని లేవనెత్తుతామని చెప్పారు. తెలంగాణ కోసం ఎవరితోనైనా కొట్లాడుతామని తేల్చిచెప్పారు. ఆదివారం (డిసెంబర్ 21) తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.
‘‘బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేండ్లు తెలంగాణ రాష్ట్రం శాంతియుతంగా ఉంది. ఎన్నికల్లో పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేశారు. నోటికొచ్చిన హామీలు ఇచ్చారు. మాయ మాటలతో జనాలను మోసం చేస్తున్నారు. ప్రస్తుతం పత్తి, వడ్లు కొనే దిక్కు లేదు రాష్ట్రంలో. యూరియా కోసం రైతులు క్యూ కడుతున్నారు. బీఆర్ఎస్ ఉన్నన్ని రోజులు యూరియా కోసం చెప్పుల లైన్లు ఉండేవా..? యూరియా బస్తాల కోసం యాప్ తెస్తారంట.
ఏ గోదాంలో యూరియా ఉందో చెప్పడానికి యాప్ ఎందుకు..? కాంగ్రెస్ కు ఓట్లేసిన జనం ఇప్పుడు తలలు పట్టుకుంటున్నరు. ప్రజలు ఈ ప్రభుత్వంపై విశ్వాసాన్ని కోల్పోతున్నరు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా..? నిద్ర పోతుందా..? నిద్రలేస్తే రియల్ ఎస్టేట్ తప్ప మరొకటి లేదా. ఎంతసేపు రియల్ ఎస్టేట్ భూములు అమ్ముకోవడమేనా..? రెండేళ్ల నుంచి మౌనంగా చూస్తున్నాం. ఇక ఈ అన్యాయాన్ని సహించేది లేదు. గ్రామ గ్రామాన ఉద్యమాన్ని లేవనెత్తుతాం.
బహిరంగ సభలు పెట్టి ప్రభుత్వ అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తాం. ఇవాళ్టి నుంచి ఒక లెక్క.. రేపటి నుంచి మరో లెక్క.. ఈ ప్రభుత్వం తోలు తీస్తాం. తెలంగాణకు అన్యాయం చేస్తోన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఇక పోరాటమే. తెలంగాణ కోసం ఎవరితోనైనా కొట్లాడుతాం’’ అని కేసీఆర్ అన్నారు. ఇది సర్వభ్రష్ట ప్రభుత్వం అని.. రాష్ట్రంలో క్రైమ్ రేట్ 20 శాతం పెరిగిందని విమర్శించారు. హైదరాబాద్ జంట నగరాల్లో పట్టపగలే హత్యలు జరుగుతున్నాయన్నారు.
