
హైదరాబాద్, వెలుగు: రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా రాష్ట్రంలోని 50 లక్షల మంది మాదిగల నోట్లో మట్టి కొట్టిన కేసీఆర్.. ఇప్పుడు మహారాష్ట్రలోని మాతంగ మాదిగ ఓట్లపై కన్నేశారని ధర్మ సమాజ్ పార్టీ (డీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ మండిపడ్డారు. మాతంగ మాదిగలను అందలమెక్కిస్తామంటూ మరో మోసానికి తెరదీశారని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఒక కులం సామాజిక, సాంస్కృతిక చరిత్ర తెలుసుకుని సభల్లో చెప్తుంటారని, ఆయన అలా చెప్పేసరికి ఆ కులంలోని నాయకులంతా ఎంత గొప్పగా చెప్పారో అనుకుని కేసీఆర్ ఉచ్చులో పడిపోతారని చెప్పారు. కానీ, అదంతా కేసీఆర్ చెప్పే ఆవు పులి కథే అని విశారదన్ ఎద్దేవా చేశారు.
మహారాష్ట్రలో మాతంగుల చరిత్ర తెలుసుకుని.. తన స్టైల్లోనే వారి గురించి సభలో చెప్పారన్నారు. కేసీఆర్ చేతిలో మాతంగులు మోసపోకుండా అక్కడకు వెళ్లి ఆ సామాజికవర్గం వారిని చైతన్యపరుస్తామని తెలిపారు. దళితులను సీఎం చేస్తామని చెప్పి కేసీఆర్ ఎట్లా మోసం చేశారో వారికి వివరిస్తామన్నారు. మహారాష్ట్రలో మాతంగులు కోటి మంది దాకా ఉన్నారని, కేసీఆర్కు దమ్ముంటే మహారాష్ట్ర బీఆర్ఎస్ సీఎం అభ్యర్థిగా మాతంగి వర్గం అభ్యర్థిని ప్రకటించాలని డిమాండ్ చేశారు.