బాబాసాహెబ్ విగ్రహాన్ని ఆవిష్కరించే హక్కు కేసీఆర్ కు లేదు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

బాబాసాహెబ్ విగ్రహాన్ని ఆవిష్కరించే హక్కు కేసీఆర్ కు లేదు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
  • దళితులపై దాడులు చేస్తూ.. అంబేద్కర్ జయంతిలో  పాల్గొంటరా?
  • బాబాసాహెబ్ విగ్రహాన్ని ఆవిష్కరించే హక్కు కేసీఆర్ కు లేదు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
  • నేరెళ్ల బాధితులకు పరిహారం ఎందుకియ్యలే?
  • ఈ నెల 18న ‘నిరుద్యోగ భరోసా దీక్ష’ చేస్తామని ప్రకటన 

రాజన్న సిరిసిల్ల, వెలుగు: రాష్ట్రంలో ఒకపక్క దళితులపై దాడులు చేస్తూ మరోపక్క వచ్చే అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో సీఎం కేసీఆర్ ఎలా పాల్గొంటారని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే హక్కు కేసీఆర్ కు లేదన్నారు. ఇసుక మాఫియాను అడ్డుకున్నారన్న కారణంగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన ఎస్సీ, బీసీ బిడ్డలపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని మండిపడ్డారు. శనివారం సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా నేరెళ్ల బాధితులను కలిసి పరామర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. పోలీసులు కొట్టిన దెబ్బల వల్ల కోల హరీశ్, బానయ్య తదితరులు ఇప్పటికీ ఏ పనీ చేసుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇవ్వలేదన్నారు. నేరెళ్ల ఘటనలో దళితులను హింసించిన పోలీసులపై కేసు నమోదు చేయకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో ప్రశ్నించే మీడియాను బ్యాన్ చేయడాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. వీ6 ‘వెలుగు’పై ఆంక్షలు విధించడం సరికాదన్నారు.   

టీఎస్​పీఎస్సీకి  కేటీఆర్ పీఆర్వోనా? 

రాష్ట్ర ప్రభుత్వానికి టెన్త్ పేపర్ లీక్​పై ఉన్న శ్రద్ధ.. టీఎస్​పీఎస్సీ  పేపర్ లీక్​లపై ఎందుకు లేదని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. శనివారం సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఓబులాపూర్, సారంపల్లి గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలను, కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలో కాన్షీరాం విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘టీఎస్ పీఎస్సీకి మంత్రి కేటీఆర్ పీఆర్వోనా? గ్రూప్ 1 అభ్యర్థులకు వచ్చిన మార్కులు ఆయనకు ఎలా తెలిశాయి? ఆ వివరాలను బాహాటంగా ఎలా ప్రకటిస్తారు? ప్రభుత్వ తీరు చూస్తుంటే సీఎం ఆఫీసుకు, టీఎస్​పీఎస్సీకి  సంబంధం ఉన్నట్టు అనిపిస్తోంది” అని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ తనకు నచ్చిన వ్యక్తులకు పదవులు కట్టబెట్టి టీఎస్​పీఎస్సీని ఆగం పట్టించారన్నారు. టీఎస్​పీఎస్సీ  చైర్మన్ సహా  సభ్యులను తొలగించాలని ఆయన  డిమాండ్ చేశారు. టీఎస్​పీఎస్సీ  లీకులపై సీబీఐతో దర్యాప్తు చేయించాలన్న డిమాండ్ తో ఈ నెల 18న ఇందిరాపార్క్ వద్ద నిరుద్యోగ భరోసా దీక్ష చేపడుతున్నట్టు ప్రకటించారు.