హరీష్ కు కేసీఆర్ ఊహించని షాక్ ఇవ్వబోతున్నారు

హరీష్ కు కేసీఆర్ ఊహించని షాక్ ఇవ్వబోతున్నారు

కాంగ్రెస్ ప్రచార కమిటి చైర్మన్ విజయశాంతి

హైదరాబాద్: దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్లు రాకుండా చేయాలని కంటి మీద కునుకు లేకుండా.. చెమటోడ్చి పనిచేస్తున్న తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావుకు  ఆయన మామ, సీఎం కేసీఆర్ ఊహించని షాక్ ఇచ్చినట్లు చర్చ జరుగుతోందని కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ విజయశాంతి తెలిపారు. దుబ్బాక ఉపఎన్నిక తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలను నిర్వహించి, ఆ ఫలితాలు రాగానే తన తనయుడు కేటీఆర్‌కు సీఎం పదవి ఇచ్చేందుకు కేసీఆర్ రంగం సిద్ధం చేసినట్టు టీఆర్ఎస్ వర్గాల ప్రచారం జరుగుతోందని.. ఈ వాదనకు బలం చేకూర్చేలా… మొదటిసారి కెసిఆర్ నోట సీఎం పదవికి రాజీనామా మాట బయటకొచ్చిందని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

బీజేపీ మీద నెపం పెట్టి… సీఎం పదవికి రాజీనామా చేస్తానని కేసీఆర్ సంకేతాలివ్వడం భవిష్యత్ రాజకీయానికి అద్దం పడుతోందని విశ్లేషకుల మాట.. కేంద్ర హోంమంత్రి, బిజెపి మాజీ అధ్యక్షుడు అమిత్ షా గతంలో తెలంగాణ వచ్చినప్పుడు కేంద్ర నిధులను కేసీఆర్ సర్కారు దుర్వినియోగం చేస్తోందన్నారు…  నాడు దీనిపై స్పందించిన కేసీఆర్ ‘‘నోటికొచ్చినట్లు ఆరోపణలు చేయడం కాదు… ఆధారాలను చూపించకపోతే అమిత్ షా తెలంగాణ భూభాగం నుంచి కదలనివ్వను.. అని వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని ఎవరూ మర్చిపోలేరు… తర్వాత ఆ వార్నింగ్ ఏమైందో ఎవరికీ అంతుచిక్కలేదని విజయశాంతి పేర్కొన్నారు.

తనపైన, సర్కారుపైనా నిరాధార ఆరోపణలు చేస్తే, విపక్ష నేతల్ని జైలుకు పంపిస్తానని కెసిఆర్ బెదిరించిన సందర్భాలూ ఉన్నాయి..  తన సర్కారుపై ఆరోపణలు చేస్తే విపక్షాలపై విరుచుకుపడే కేసీఆర్.. నేడు సీఎం పదవికి రాజీనామా చేస్తానని కొత్త అంశాన్ని ఎందుకు తెరమీదకు తెచ్చారనే ప్రశ్న వస్తోందని.. ఓ వైపు హరీష్ రావు దుబ్బాకలో బీజేపీ నేతల మీద విరుచుకు పడుతుంటే.. ఆయన ప్రచారాన్ని డామినేట్ చేసేలా కేసీఆర్ బీజేపీ నేతలకు సవాల్ విసరడం అనుమానాలకు తావిస్తోంది.. ఈ ప్రకటన బిజెపి నేతలకే కాదు.. పరోక్షంగా హరీష్ రావుకి కూడా సంకేతం ఇచ్చినట్టేనని తెలంగాణ సమాజం భావిస్తోందని విజయశాంతి వివరించారు.

మొత్తం మీద కెసిఆర్ గారి రాజీనామా ప్రకటన చూస్తుంటే.. దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించిన తర్వాత (ఒకవేళ గెలిస్తే) హరీష్ రావుకి ఆయన మామ కేసీఆర్ బంపర్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారని… ఆ గిఫ్ట్ ఏమిటంటే..  తాను సీఎం పదవికి రాజీనామా చేసి, కేటీఆర్‌ను సిఎం గద్దెపై కూర్చోబెట్టబోతున్నారన్న వాదన వినిపిస్తోంది… ఎంతైనా నమ్మినవారిని గొంతు కోయడంలో కెసిఆర్ అనుసరించే స్టైలే వేరు అని విజయశాంతి పేర్కొన్నారు.