ఎస్‌‌డీఆర్‌‌‌‌ఎఫ్‌‌ నిధులను వాడుకోలేని చేతగాని అసమర్థుడు కేసీఆర్‌‌‌‌ : ఎంపీ అర్వింద్

ఎస్‌‌డీఆర్‌‌‌‌ఎఫ్‌‌ నిధులను వాడుకోలేని చేతగాని అసమర్థుడు కేసీఆర్‌‌‌‌ : ఎంపీ అర్వింద్
  • కేసీఆర్‌‌‌‌ది దద్దమ్మ సర్కార్ 
  • వానలతో రైతులు నష్టపోతే మహారాష్ట్రలో తిరుగుతడా?: ఎంపీ అర్వింద్
  • ఎస్‌‌డీఆర్‌‌‌‌ఎఫ్‌‌ నిధులను వాడుకోలేని చేతగాని అసమర్థుడు
  • అబ్‌‌కీ బార్ కిసాన్ సర్కార్ అనడానికి సిగ్గుందా అని ప్రశ్న

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో వర్షాలతో రైతులంతా తీవ్రంగా నష్టపోతే.. కేసీఆర్ మాత్రం బీఆర్ఎస్ అంటూ మహారాష్ట్రలో తిరగడం ఏంటని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఫైర్ అయ్యారు. అబ్‌‌కీ బార్ కిసాన్ సర్కార్ అనడానికి ఆయనకు సిగ్గుందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో చేతగాని, దగుల్భాజీ, దద్దమ్మ సర్కార్ ఉందని విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఓ అసమర్థ సీఎం అని, ఆయనకు పదవిలో కొనసాగే అర్హత లేదని మండిపడ్డారు. గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో అర్వింద్ మాట్లాడారు. ‘‘కనీసం రైతులను ఓదార్చకుండా, వారిని పలకరించకుండా, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా.. బిడ్డ, కొడుకులను కేసుల నుంచి తప్పించేందుకు బీఆర్ఎస్ అంటూ కొత్త సర్కస్ ముందేసుకున్నాడు. కేసీఆర్ కన్నా పెద్ద ఫామ్ హౌస్‌‌లో వ్యవసాయ మంత్రి ఉంటున్నాడు. మార్కెటింగ్ శాఖ మంత్రికి తిని, పండుడు తప్ప ఇంకేమీ లేదు. ఇలా అయితే పాలన ఎట్ల? ఇదేనా తెలంగాణ అడ్మినిస్ట్రేషన్?” అని నిప్పులుచెరిగారు. 

దద్దమ్మ సర్కార్

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆత్మీయ సమ్మేళనాల పేరుతో డ్యాన్సులు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకునేందుకు గవర్నర్ తమిళిసై జోక్యం చేసుకొని, పంట నష్టంపై నివేదిక తెప్పించుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఫసల్ బీAమా అమలు చేయనందున, నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానాలో రైతులకు ఫసల్ బీమా అమలు చేస్తూనే.. మెరుగైన రీతిలో రైతులను ఆదుకుంటున్నారని చెప్పారు.

రైతు ఆత్మహత్యల్లో నంబర్ వన్

నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో లెక్కల ప్రకారం 2017 నుంచి2021 వరకు రాష్ట్రంలో 6 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, దేశంలో రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణనే నంబర్ వన్ అని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. మార్కెటింగ్ శాఖకు బడ్జెట్ తగ్గించి రైతుల మీద కేసీఆర్ కు ఉన్న ప్రేమ ఎలాంటిదో నిరూపించుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. రూ.131 కోట్ల బడ్జెట్ ఉన్న మార్కెటింగ్ శాఖకు గత బడ్జెట్ లో కేవలం రూ.9 కోట్లు కేటాయించారని ఆరోపించారు. స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్‌ను కూడా వాడుకోలేని, చేతగాని అసమర్థుడు కేసీఆర్ అని ఫైర్ అయ్యారు. ‘‘ఓ వైపు పేపర్ లీకేజీలు, ఇంకో వైపు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. మరో వైపు  రైతుల పంటకు నష్ట పరిహారం, గిట్టుబాటు ధర ఇవ్వలేని సర్కార్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడి  రైతులకు పరిహారం ఇవ్వకుండా రూ.వందల కోట్లు ఖర్చు పెట్టి జాతీయ స్థాయిలో కేసీఆర్ సొంత డబ్బా కొట్టుకోవడం ఏమిటి?” అని ప్రశ్నించారు.